Lagacharla | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటును స్థానికులు ఎంత వ్యతిరేకిస్తున్నా భూ సేకరణపై ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల పరిధిలో బహుళార్థసాధక పారిశ్రామికవాడ కోసం మరో 497ఎకరాలు సేకరించేందుకు ఆదివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని స్పష్టంచేసింది. లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాలు సేకరించేందుకు శనివారం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా లగచర్లలో మరో 497ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఒక్క లగచర్లలోనే ఇప్పటివరకు 607.39 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది.
దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం హకీంపేట్, పోలెపల్లి, లగచర్ల పరిధిలో 1358.37 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేసి అభిప్రాయ సేకరణ చేపట్టగా, రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తం కావడంతో వెనక్కితగ్గింది. ఇప్పుడు ఫార్మా విలేజ్ స్థానంలో బహుళార్థసాధక పారిశ్రామికవాడ పేరుతో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు 679.31 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చినట్టయింది. లగచర్లలో క్రితంసారి 632.26 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పుడు 607.39 ఎకరాలకే నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. ఒకేసారి కాకుండా క్రమక్రమంగా భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. పరిహారం పెంచి అయినా భూసేకరణ చేయాలని పట్టుదలతో ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఈ క్రమంలోనే శనివారం మహబూబ్నగర్ సభలో సీఎం మాట్లాడుతూ, పారిశ్రామికవాడ ఏర్పాటును సమర్థించుకున్నారు.
అవసరమైతే ఎకరాకు రూ.20 లక్షలయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కాగా, బహిరంగ మార్కెట్లో ధరలకు, ప్రభుత్వం చెప్తున్న ధరలకు పొంతన లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున ఇచ్చినా తాము ఇతర ప్రాంతాల్లో మళ్లీ భూములు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. భూములు కోల్పోతే ఉపాధి పూర్తిగా పోతుందని ఆందోళన చెందుతున్నారు. భూ సేకరణపై ఓవైపు ప్రభుత్వ మొండి పట్టుదల, మరోవైపు రైతుల ఆందోళనతో లగచర్ల ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.