హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి శనివారం జీవో 636 జారీ చేశారు. ఏజీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన నియామకం అమల్లోకి రానుంది. ఉమ్మడి రాష్ట్రం లో చివరి సీఎం ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం లో సుదర్శన్‌రెడ్డి ఏజీగా పనిచేశారు. ఇప్పుడు తిరిగి రెండోసారి అదే పదవిని పొందారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సిఫారసుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
ప్రస్తుత జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచ్పల్లిలోని వ్యవసాయ కుటుంబంలో జగపతిరెడ్డి, బుచ్చమ్మ దంపతులకు 1959 జూలై 25న సుదర్శన్‌రెడ్డి జన్మించారు. ఆయనకు భార్య రేణుక, పిల్లలు మహిత, ఆదిత్య ఉన్నారు. సెయింట్ పాల్స్ సూల్లో పాఠశాల విద్యనభ్యసించిన సుదర్శన్‌రెడ్డి నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. బార్ కౌన్సిల్లో 1985లో న్యాయవాదిగా చేరిన ఆయనకు అన్ని కోర్టుల్లోనూ వాదించిన అనుభ వం ఉంది. 2011- 2014 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చివరి అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఏజీగా ఉన్న బీఎస్ ప్రసాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన రాజీనామా చేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గా తేరా రజనీకాంత్‌రెడ్డిని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.