దుండిగల్, నవంబర్ 14: హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలోకి వెళ్తే.. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతులకు కుమారుడు జశ్వంత్‌గౌడ్ (17)తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జశ్వంత్‌గౌడ్ నిజాంపేట్ జర్నలిస్టు కాలనీలోని శ్రీచైతన్య బాలుర వసతిగృహంలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి పడుకున్నాడు. గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తోటి విద్యార్థులు నిద్రలేచి చూడగా గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరి వేసుకొని వేలాడుతూ కన్పించాడు. విషయాన్ని కళాశాల వార్డెన్‌కు తెలుపగా వెంటనే నిజాంపేట్‌లోని హోలిస్టిక్ దవాఖానకు తరలించారు. అప్పటికే జశ్వంత్‌గౌడ్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు.
జశ్వంత్‌గౌడ్ ఆత్మహత్యకు ముందు ఓ లేఖ రాశాడని, తోటి విద్యార్థులే అతడి నుంచి లేఖను స్వాధీనం చేసుకున్నట్టు కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఆ లేఖలో.. ‘అమ్మ, నాన్న నేను చేస్తున్నది తప్పే..కానీ తప్పలేదు. నన్ను క్షమించండి.. నాన్న అమ్మ,చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో.. నాకు బతకాలని లేదు. కష్టాలు నాతోనే మొదలయ్యాయి..నాతోనే పోవాలని ఈ లేఖ రాస్తున్నాను. మన పాలివాళ్లు కూడా మన చావును కోరుకుంటున్నారు.. అందుకే నేను ముందుగా భైరవస్వామి వద్దకు వెళ్లిపోతున్నా’ నంటూ ఉత్తరం రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందులో తన చావుకు కారణమైన ఆరుగురి పేర్లను రాసి చివర్లో నాకు బతకాలని ఉంది..కానీ మన కష్టాలు పోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అందుకే ఇలా చేసిన..సారీ అమ్మానాన్న మీరు మాత్రం జాగ్రత్త.. మీరు ఎప్పుడూ కలిసే ఉండాలంటూ ముగించిండు. లేఖను చదివిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కళాశాల ముందు ఆందోళనకు దిగాయి. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.