హైదరాబాద్, ఆగష్టు 5 (నమస్తే తెలంగాణ ): ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, లెక్చరర్లు వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ(ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకు డిప్యూటేషన్‌పై పంపించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతుంటారు. మెడికల్, పర్సనల్, స్పౌజ్ వంటి ఇతర కుటుంబ కారణాలను చూపుతూ అధికారులకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారింది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఈ తరహా వచ్చే అర్జీలను ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
కళాశాల విద్యా కమిషనర్, సాంకేతిక విద్యా కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఇంటర్ విద్యా డైరెక్టర్ సభ్యులుగా ఉండగా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. పైరవీలకు తావులేకుండా నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రతీ ఏడాది మే, ఆగస్టు, నవంబర్ మొదటి వారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడో వారంలో సమావేశమై నిర్ణయం తీసుకొని అదే నెలలో 25లోపు సంబంధిత హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేస్తుంది. కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు బదిలీలు, ఓడీ, డిప్యూటేషన్‌కు చర్యలు తీసుకుంటారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ శాఖలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. డీఆర్డీవో, డీఆర్డీఏ, సీఈవో, డీపీవోల స్థానాల్లో కొత్తవారిని నియమించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.