హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమావేశాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం వేదిక కావాలని ఆకాంక్షించారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలంలోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను అనుమతించాలని కోరారు.
రాష్ట్రంలో ‘ఆర్థిక’ ఎమర్జెన్సీ విధించాలి ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడిచినా పాలన గాడిన పడలేదని విమర్శించారు. ఆరు నెలలుగా జీపీఎఫ్ నిధులు రాకపోవడంతో కనీసం మొకలు నాటే కార్యక్రమానికి కూడా డబ్బులు లేక జీపీలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే వాడుకుంటున్నదని ఆరోపించారు. గ్రామ పంచాయతీలపై సీఎం రేవంత్ సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.