Telangana | ఎదులాపురం, జనవరి 14: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి ఆధ్యాత్మిక బాటలో నడిచి సన్యాసిగా మారాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్‌పేట్‌కు చెందిన ట్వింకల్ కామ్దార్ జైనమత సన్యాసం స్వీకరించనున్నారు. ఆమె స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి, అక్కడే ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
29 ఏండ్ల ట్వింకల్ కామ్దార్ 2007 నుంచి జైన మతగురువు రామ్‌లాల్ జీ బోధనలు వింటున్నది. అందుకు ఆకర్షితులై సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంప్రదాయబద్ధంగా చందన మండల పూజాక్రతువును ప్రారంభించారు. ఆదివారం ఉదయం ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.
భారీ సంఖ్యలో భక్తులు, జైనమతస్థులు హాజరు కాగా.. భక్తిగీతాలతో ప్రధాన వీధులు మార్మోగాయి. ఈ నెల 22న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జావుదాలో దీక్షా మహోత్సవం సందర్భంగా జైనమత సన్యాసాన్ని స్వీకరించనున్నట్టు ట్వింకల్ కామ్దార్ తెలిపారు. ఆమె తల్లి శ్వేత కామ్దార్, తండ్రి గిరీశ్ భాయ్ కామ్దార్ కొన్నేండ్ల క్రితం చనిపోయారు.