Gurukul Tenders | హైదరాబాద్, మే 5(నమస్తే తెలంగాణ): విద్యార్థులకు అందించే వెల్కమ్ కిట్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసింది. గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మొత్తం విలువలో దాదాపు రూ.1,100 కోట్లకు పైగా ఆ రాష్ట్ర కంపెనీలకే ముట్టజెప్పనున్నది.
ఇప్పటికే ఏజెన్సీలను ఖరారు చేయగా, ఈ వారంలోనే వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆగమేఘాల మీద ఓ నాన్ ఐఏఎస్ ఆఫీసర్‌ను, ఎస్సీ గురుకుల సెక్రటరీని సైతం నియమించింది. టెండర్ల ఖరారుకు మార్గం సుగమం చేసింది. ప్రభుత్వ పెద్దనే తెరవెనుక ఉండి ముందుకు నడిపిస్తుండగా, ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఏటా పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తం 24రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తుంది. గతంలో ఆ విద్యాసంస్థలే సొంతంగా జిల్లాస్థాయిలో కలెక్టర్ల ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేసేవి. ఇప్పటివరకు అదే పద్ధతి పాటించారు. కానీ తాజాగా కాంగ్రెస్ ఆ విధానానికి స్వస్తి పలికింది. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని గురుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేసింది.
విద్యార్థులకు సంబంధించిన అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులు సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను ఏకమొత్తంగా అప్పగించింది. టెండర్ నిబంధనలు సైతం బడా కంపెనీలకే దక్కేలా రూపొందించింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను తొమ్మిది ఐటమ్స్‌కు గత నెలలో టెండర్లు ఆహ్వానించింది. అన్ని ఐటమ్స్‌కు సంబంధించి 28 ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేయగా, 13 ఏజెన్సీలు మాత్రమే క్వాలిఫై అయినట్టు తెలిసింది. రెండు ఐటమ్స్‌కు రెండేసి చొప్పున ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేస్తే ఏ ఒక్కటీ అర్హత సాధించలేదని విశ్వసనీయ సమాచారం. అర్హత సాధించిన కంపెనీలకు వర్క్ ఆర్డర్లు కట్టబెట్టేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసినట్టు తెలిసింది.
విద్యార్థులకు సంబంధించి 9 వస్తువులకు గాను ప్రస్తుతం అర్హత సాధించిన 7 ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అందులో 5 ఆర్డర్లు కేవలం గుజరాత్‌కు సంబంధించిన కంపెనీలున్నాయని తెలుస్తున్నది. మిగతా రెండు కూడా ఉత్తర భారతానికి చెందినవేనని సమాచారం. ప్రధానంగా యూనిఫామ్ క్లాత్ టెండర్‌ను రూ.300కోట్లకు, పీటీ, నైట్ డ్రెస్, ట్రాక్‌సూట్ టెండర్‌ను 200కోట్లకు, బెడ్‌షీట్, బ్లాంకెట్ టెండర్‌ను రూ.150కోట్లకు గుజరాత్‌కు చెందిన ఒకే కంపెనీ దక్కించుకున్నట్టు సమాచారం. ఐడీ కార్డు, స్టేషనరీ కిట్ వర్క్ ఆర్డర్‌ను రూ.50కోట్లకు సైతం గుజరాత్ కంపెనీకే కట్టబెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే గుజరాత్‌కు చెందిన ఓ అనామక కంపెనీకి బ్యాగులు, షూలు, సాక్స్‌కు సంబంధించి వర్క్ ఆర్డర్‌ను రూ.380 కోట్లకు అప్పగిస్తున్నట్టు తెలుస్తున్నది. సదరు ఏజెన్సీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది కూడా అనుమానమేనని, ఒకే జీఎస్టీ నంబర్‌తో మహారాష్ట్రలోనూ కొనసాగుతుండటం గమనార్హం. మొత్తంగా 5 వర్క్ ఆర్డర్లు సైతం గుజరాత్ ఏజెన్సీలేనని తెలిసిపోతున్నది. అందులో ప్రధానంగా ఒక ఏజెన్సీనే 3 వర్క్ ఆర్డర్లను చేజిక్కించుకుంటుండగా, సదరు ఏజెన్సీకి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. మిగతా రెండు వస్తువులకు సంబంధించిన ఏజెన్సీల తీరే పూర్తి అనుమానంగా ఉన్నది. కేవలం సప్లయర్స్ మాత్రమేనని తెలుస్తున్నది.
ఇక నోట్‌బుక్స్ వర్క్ ఆర్డర్‌ను 130కోట్లకు, ప్లేట్, గ్లాస్, స్పూన్, కప్ వర్క్ ఆర్డర్‌ను రూ.14.73 కోట్లకు ఉత్తర భారతానికి చెందిన ఏజెన్సీలకే కట్టబెడుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా రూ.1,200కోట్ల వర్క్ ఆర్డర్లో రూ.1,100కోట్ల వరకు గుజరాత్ కంపెనీలకే కావడం గమనార్హం. అందులో ఒకే ఏజెన్సీకి 600కోట్ల విలువైన వర్క్ ఆర్డర్‌ను కట్టబెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇవి పోగా ట్రంక్ బాక్సులు, ట్రాలీబ్యాగుల కోసం రెండేసి ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేసినా ఒకటి చొప్పున మాత్రమే అర్హత సాధించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ రెండు వస్తువులకు సంబంధించి మరోసారి టెండర్లను ఆహ్వానించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
విద్యార్థుల కిట్లకు, ఐటమ్స్‌కు సంబంధించి ఈ టెండర్లో మొత్తంగా రూ.250కోట్లకుపైగా నొక్కేస్తున్నట్లుగా తెలుస్తున్నది. అందుకు అనుగుణంగా ముందస్తుగానే కంపెనీలతో బేరసారాలు సాగించినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని అంతా ఓ ఉన్నతాధికారే ముందుకు నడిపించినట్లు సెక్రటేరియట్వర్గాలు కోడై కూస్తున్నాయి. వాస్తవంగా కమీషన్ల కోసమే టెండర్లను కేంద్రీకరించారని మొదటినుంచీ వస్తున్న ఆరోపణలు. అందుకు అనుగుణంగానే బడా కంపెనీలు అర్హత సాధించేలా టెండర్ షరతులను నిర్ణయించారు.
ప్రధానంగా జిల్లాస్థాయిలో ఉన్న కాంట్రాక్టర్లు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఆ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకుండా కట్టుదిట్టంగా నిబంధనలు పొందుపర్చారు. నిర్ణయించిన టర్నోవర్, బ్యాంకు సాల్వెన్సీ, ఈఎండీల చెల్లింపుల నిబంధనలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే పేరుకే గుజరాత్ ఏజెన్సీలని, తెరవెనుక కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కుమారుడితో పాటు ఏపీకి చెందిన పలువురు చక్రం తిప్పారని, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారే ఏజెన్సీలతో, ప్రభుత్వ పెద్దల మధ్య బేరసారాలు కుదిర్చారని తెలుస్తున్నది.
టెండర్ల కోసం ప్రభుత్వం హడావుడి చేస్తుండటం గమనార్హం. టెండర్లను ఏప్రిల్ మొదటివారంలో నోటిఫికేషన్ జారీ చేయగా, తొలుత 10రోజులు మాత్రమే గడువిచ్చింది. ఆ తర్వాత మరో 3రోజులు పొడిగించింది. పది రోజుల క్రితమే బిడ్లను తెరిచారు. ముందస్తు ఒప్పందాల ప్రకారమే ఏజెన్సీలను సైతం ఖరారు చేశారు. వర్క్ ఆర్డర్లను ఇవ్వడం ఒక్కటే మిగిలిపోయింది. ఎందుకంటే ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ చైర్మన్‌గానే ప్రభుత్వం పీఎంయూను ప్రొక్యూర్మెంట్ కోసం ఏర్పాటు చేసింది. టెండర్ నోటిఫికేషన్ మొదలు, వర్క్ ఆర్డర్లను ఇవ్వడం వరకు ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీనే అత్యంత కీలకం. అయితే గురుకుల సొసైటీ సెక్రటరీగా గత నెల విజయేంద్రబోయి నియమితులైనా కూడా వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో వర్క్ ఆర్డర్ల అప్పగింత జాప్యమవుతూ వస్తున్నది. ఇదిలా ఉంటే ఇటీవలనే ప్రొక్యూర్మెంట్పై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రులెవరూ కూడా లేకపోవడం గమనార్హం. ఇక సెక్రటరీ లేకపోవడం వల్లే ఏజెన్సీలతో ఒప్పందం, వర్క్ ఆర్డర్ ఆలస్యమవుతున్నదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సెక్రటరీని నియమించడంతోపాటు ఎంపిక చేసిన ఏజెన్సీలకు ఆర్డర్లు ఖరారు చేయాలని సీఎం నొక్కిచెప్పారని తెలుస్తున్నది. సీఎం ఆదేశాలు వచ్చిన వెంటనే కేవలం టెండర్ల కోసమేనన్నట్టు గురుకుల సెక్రటరీని ఆగమేఘాల మీద ఓ టీచర్‌ను ప్రభుత్వం నియమించారు. మూడురోజుల్లో టెండర్లకు సంబంధించి వర్క్ ఆర్డర్లను జారీ చేసేందుకు రంగం చేసినట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్రీకృత విధానం వల సూక్ష్మ, మ ధ్యతరహా పరిశ్రమలకు, వాటిపై ఆధారపడిన కార్మికులకు తీరని నష్టం వాటిల్లనున్నది. విద్యార్థులకు సంబంధించి ఏకరూప దుస్తులను తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వా రానే ఇప్పటివరకు కొనుగోలు చేసేవారు. తద్వారా దాదాపు 24వేల మంది కార్మికుల కు ఉపాధి లభించేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దుస్తుల ఆర్డర్ గుజరాత్‌కు తరలిపోతే కార్మికులకు పనిలేకుండా పోతుంది. పెద్దమొత్తంలో, నిర్ణీత గడువులోగా ఐటమ్స్ ను సరఫరా చేయలేరని, స్థానిక ఉత్పత్తుల నాణ్యత కూడా ఏమాత్రం ఉండటం లేదని, అందుకే జాతీయస్థాయికి వెళ్తున్నామని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానిస్తుండటంపై పరిశ్రమదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పరిశ్రమల ఉత్పత్తులను, శక్తి సామర్థ్యాలను సైతం ప్రభుత్వ పెద్దలు అవమానిస్తుండటంపై కాంట్రాక్టర్లు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమదారులు తప్పుబడుతున్నారు.