హైదరాబాద్, మే 24 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యా ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సీనియర్ లాయర్, బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధి ఎంఏ ముఖీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని కోరారు. వక్ఫ్ భూములను కాపాడేందుకు పోరాడిన ఆయనను దుండగులు హతమార్చడం దారుణమని ఖండించారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధులు అమృత్‌రావు, కావ్య, కిరణ్‌రావు, వంశీకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు. లాయర్లపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని, పట్టపగలే దారుణంగా హతమారుస్తున్నారని ఆరోపించారు. ఖాజా మొయిజుద్దీన్‌కు ప్రాణహాని ఉన్నదని తెలిసినా రక్షణ కల్పించడంలో పోలీస్‌శాఖ దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు. పోలీస్‌స్టేషన్‌లో స్పెషల్ కౌన్సెలింగ్ రూం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. తెలం గాణలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని విమర్శించారు. మొయిజుద్దీన్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఆయన కొడుకు ఫర్హాన్, కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మొయిజుద్దీన్‌ను పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలే హత్యచేసినట్టు వారి కుటుంబీకులు చెబుతున్న విషయాన్ని ఉటంకించారు. ఈ హత్య న్యాయవ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. హత్య జరిగి 24 గంటలు దాటినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ గాడితప్పిందని దుయ్యబట్టారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. మొయిజుద్దీన్ హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లీగల్సెల్తోపాటు న్యాయవాదులందరూ మొయిజుద్దీన్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అడ్వకేట్ మొయిజుద్దీన్‌కు రక్షణ కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని రంగారెడ్డి బార్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ రవికుమార్ దుయ్యబట్టారు. మహానగరం నడిబొడ్డున న్యాయవాది హత్యకు గురికావడం రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతున్నదని మండిపడ్డారు.
ఖాజా మొయిజుద్దీన్‌కు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని హైకోర్టు బార్ కౌన్సిల్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కల్యాణ్‌రావు డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్‌కు కూతవేటు దూరంలో న్యాయవాదిని హత్యచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు ఎక్కువయ్యాయని, పోలీస్స్టేషన్లకు వెళ్తే అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో లాయర్లు ఆత్మగౌరవంతో బతికారని తెలిపారు. తనకు ప్రాణహాని ఉన్నదని మొయిజుద్దీన్ ఎన్నోసార్లు ఫిర్యాదుచేసినా పోలీసులు పెడచెవిన పెట్టారని ఆరోపించారు.