మందమర్రి, జనవరి 28 : అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు వెళ్లిన ఓ సింగరేణి కార్మికుడికి చేదు అనుభవం ఎదురైంది. బెడ్లు ఖాళీగా లేవని తిప్పిపంపించారంటూ బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నది. మంచిర్యాల జిల్లా మం దమర్రికి చెందిన బొగ్గు కుమారస్వామి మందమర్రి ఏరియా వర్క్‌షాప్‌లో జనర ల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల రక్తం తక్కువగా ఉండటంతో అనారోగ్యం బారినపడ్డాడు. స్థానిక డిస్పెన్సరీకి వెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానకు వెళ్లాడు. అక్కడ వారం రోజులపాటు చికిత్స అం దించిన వైద్యులు.. మెరుగైన వైద్యకోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు రెఫర్ చేశారు.
శనివారం నిమ్స్‌కు వెళ్లగా.. అక్కడి వైద్యు లు బెడ్లు ఖాళీగా లేవని, ఉస్మానియా లేదా గాంధీకి వెళ్లాలని సూచించారు. లేదంటే సోమవారం వరకు వేచి ఉండాలని ఉచిత సలహా ఇచ్చారు. దిక్కుతోచని స్థితిలో తిరిగి రామకృష్ణాపూర్ ఏరియా దవాఖానకు వచ్చామని కుమారస్వామి సతీమణి వినోద తెలిపింది. రక్తం తక్కువగా ఉందంటూ డీవైసీఎంవో డాక్టర్ ఉషారాణి తిరిగి హైదరాబాద్‌లోని వేరే దవాఖానకు రిఫర్ చేశారు. ఈ విషయమై సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. నిమ్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.