Singareni | మంచిర్యాల : సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదం జరిగి ఓ కార్మికుడు మృతి చెందాడు. మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే 5 గనిలో సెకండ్ షిఫ్ట్‌లో సైడ్ రూఫ్ ఫాల్ కూలిపోయింది. దీంతో బొగ్గుపెల్లలు మీద పడి రాచపల్లి శ్రవణ్ కుమార్ (32) అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రవణ్ కుమార్ కోల్ మైనింగ్ మెషీన్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బొగ్గు పెల్లలు మీద పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తోటి కార్మికులు అప్రమత్తమై రామకృష్ణాపురంలోని ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, శ్రవణ్ మృతి చెందాడని పలు యూనియన్లు మండిపడ్డాయి. బొగ్గు గనుల్లో సెఫ్టీ మెజర్స్ పాటించడం లేదని, కార్మికుల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బావుల్లో తరుచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, కానీ పట్టించుకునే నాథుడు లేడని ధ్వజమెత్తారు. బొగ్గు బావుల్లో తక్షణమే భద్రతా ప్రమాణాలను పెంచాలని యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు.