మంగపేట, అక్టోబర్ 11: అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలు కూలుస్తుండటంతో మనస్తాపానికి గురైన గొత్తికోయగూడెం వాసి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం శాంతినగర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. గత నెల 5న మంగపేట మండల కేంద్రం సమీప అటవీ ప్రాంతంలోని శాంతినగర్‌లో గొత్తికోయల నివాసాలను అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు.
కొత్తగా గుడిసెలు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడిసెలు వేయబోమని లిఖిత పూర్వకంగా హామీ పత్రం రాసి ఇవ్వాలని పోలీసుల సమక్షంలో హెచ్చరించగా గొత్తికోయలు రాసివ్వలేదు. ఈనెల 10న అటవీ శాఖ అధికారుల బృందం మళ్లీ శాంతినగర్ గూడెంలోకి వెళ్లి గొత్తికోయలకు చెందిన 12 గుడిసెలను కూల్చివేశారు. దీంతో గొత్తికోయ సోయం సురేశ్ పురుగుల మందు తాగి అటవీ అధికారుల జీపును అడ్డుకునే యత్నంచేశాడు.
గుడిసెను కూల్చితే తాను, తన భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఎక్కడ ఉండాలని జీపు వెంట పరుగెత్తి ఒర్రెలో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన గొత్తికోయలు సురేశ్‌కు నీళ్లు తాగించి పురుగుల మందు కక్కించే ప్రయ త్నం చేశారు. అనంతరం వైద్యం కోసం ఏటూరునాగారంలోని దవాఖానలో చేర్చా రు. అటవీ అధికారులు గుడిసెలను కూల్చేస్తుండగా తన సెల్ఫోన్లో ఫొటోలు తీసినందుకు సురేశ్ సెల్ ఫోన్‌ను సైతం అటవీ శాఖ సిబ్బంది లాక్కెళ్లారని సమాచారం.