కొండాపూర్, ఫిబ్రవరి 2 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అరుదైన గౌరవం దక్కింది. వర్సిటీలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ రిసెర్చ్ చైర్ ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్ర, బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ పీ ప్రకాశ్ బాబు యూకేలోని ప్రతిష్ఠాత్మక ఫెలోస్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ (ఎఫ్ఆర్ఎస్బీ)కి ఎంపికైనట్టు యాజమాన్యం తెలిపింది. ప్లాంట్ సైన్స్ విభాగంలో ఉత్తమ సేవలకుగాను ప్రొఫెసర్ రాఘవేంద్ర జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకొన్నారని పేర్కొన్నది. ప్రొఫెసర్ ప్రకాశ్‌బాబు పరిశోధన బృందం న్యూరో క్లినిక్స్‌తో కలిసి మెదడుకు సంబంధించిన వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నట్టు తెలిపింది. వర్సిటీ ప్రొఫెసర్లు బయాలాజీ ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేసింది.