Kollapur | కొల్లాపూర్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పశువుల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ గ్రామ యువకుడు చంద్రయ్య యాదవ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టిన జల దీక్ష సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొనసాగుతుంది.
ఎన్నో దశాబ్దాల నుంచి పశువుల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ ఉన్న ఆ డిమాండ్‌ను రాజకీయ డిమాండ్‌గా మాత్రమే ఉంచారని, వర్షాలు వచ్చిన ప్రతిసారి వాగును దాటలేక రైతులు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు కూడా పశువుల వాగును దాటవలసి ఉందన్నారు. కొన్ని సందర్భాలలో దహన సంస్కారాలను నిర్వహించేందుకు ఉదృతంగా ప్రవహిస్తున్న పశువుల వాగును దాటేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు వంతెన నిర్మాణం పట్టాలని విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పశువుల వాగు ఉదృతంగా ప్రవహిస్తుందని దీంతో రైతులు కూలీలు వాగును దాటేందుకు వీలు కావడం లేదన్నారు. మహిళలు ఆత్మగౌరవాన్ని చంపుకొని వాగును దాటే పరిస్థితిని చూడలేక జల దీక్ష చేపట్టినట్లు యువకుడు నమస్తే తెలంగాణతో వెల్లడించాడు. న్యాయమైన డిమాండ్ కోసం గ్రామ యువకుడు దీక్ష చేపట్టి పది గంటలు గడుస్తున్నా పాలకులు అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజా సమస్యల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి స్పష్టం అవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వంతెన నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి రామాపురం గ్రామ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి ప్రత్యేక చొరవతో రూ. 2 కోట్ల 40 లక్షలను మంజూరు చేయించడంతో పాటు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో వంతెన నిర్మాణ పనులను పక్కన పెట్టడం మూలంగా సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.