Cyber Crime | పటాన్చెరు/మెట్పల్లి/సీసీసీ నస్పూర్, ఆగస్టు 3: తక్కువ పెట్టుబడి..ఎక్కువలాభాలు అని కేటుగాళ్లు పంపిన మెసేజ్‌లకు ముగ్గురు స్పందించారు. వారి ఆఫర్లకు చిక్కి రూ.3.16 కోట్లు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించా రు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఏపీఆర్ హోమ్స్‌లో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని రూ.2.43 కోట్లు పోగొట్టుకున్నాడు. జూన్ నెలలో ఫేస్బుక్లో వచ్చిన ప్రకటనకు ఆకర్షితుడై 22 విడుతల్లో రూ.2.43 కోట్లు పెట్టుబడి పెట్టాడు.
పెట్టుబడి లాభాలతో కలిసి రూ.6 కోట్లకు చేరినట్టుగా అకౌంట్లో చూపింది. నగదును విత్‌డ్రా చేసుకోవాలని శుక్రవారం ప్రయత్నం చేస్తే డబ్బు లు కనిపించలేదు. దీంతో మోసపోయానని పోలీసులను ఆశ్రయించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఓ పిల్లల వైద్యుడికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అలవాటు. మే 18న ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఆక్సెల్ స్టూడెంట్ సీ 95 గ్రూప్‌లో లింక్ ఓపెన్ చేసి అదే నెల 22 నుంచి విడుతల వారీగా మొత్తం రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత రూ.50 లక్షలు కట్టాలని, లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని చెప్పడంతో తన వద్ద ఉన్న కొంత, మరికొంత అప్పు చేసి రూ.50 లక్షలు కట్టాడు. జూన్ 26న ఐపీవోలో పెట్టిన పెట్టుబడి లాభం రూ.1.27 కోట్లకు పెరిగిందని, మళ్లీ ఇంకో ఐపీవో సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని వాట్సాప్ కాల్ వచ్చింది.
ఇక తన వద్ద డబ్బు లేదని, తన డబ్బులు విత్‌డ్రా చేసుకుంటానని చెప్పాడు. అలాగైతే 20 శాతం సర్వీస్ టాక్స్ చెల్లించాలని, విత్‌డ్రా చేసుకునే మొత్తం రూ.1.27 కోట్లలో 30 శాతం డిపాజిట్ చేయాలని చెప్పడంతో కంగుతిన్నాడు. బాధితుడు గత నెల 4న సైబర్‌క్రైమ్ విభాగానికి, 13న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సాంబర్ ప్రశాంత్‌కుమార్ గ్రాజ్వెల్స్ యాప్‌లో రూ.99,200 పెట్టుబడి పెట్టాడు. నగదు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే యాప్, వారి వాట్సాప్ నంబర్ పనిచేయలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు శనివారం సీసీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై నెల్కి సుగుణాక్ తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930ను సంప్రదిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.