జహీరాబాద్, నవంబర్ 2 : తాను కొనుగోలు చేసిన ప్లాట్ అమ్మకానికి ఓ ప్రైవేటు ఉద్యోగి లక్కీడ్రా (Lucky Draw) పెట్టాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు (Zaheerabad) చెందిన విస్లావత్ వినోద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ ప్లాంట్‌లో ఉద్యో గం చేస్తున్నాడు. కొంత కాలం క్రితం జహీరాబాద్ సమీపంలోని పస్తాపూర్ బైపాస్ రోడ్డు ప్రాంతంలోని శిరీషా వెంచర్లో 166 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఈ స్థలంలో ప్రస్తుతానికి స్లాబ్ వరకు నిర్మాణం పూర్తిచేశాడు. ప్రస్తుతం మార్కెట్లో ప్లాట్ విలువ రూ.35 లక్షల వరకు ఉంది. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ప్లాట్ అమ్ముడుపోవడం లేదు. దీంతో లక్కీ డ్రా పద్ధ్దతిని ఎంచుకున్నాడు. శ్రీతిరుమల ఈవెంట్స్ పేరుతో బంపర్ ఆఫర్‌ను ప్రకటించాడు. ఈ లక్కీడ్రాలో పాల్గొనే వారి కోసం కూపన్ ధర రూ. 1500గా నిర్ణయించాడు.
లక్కీడ్రాలో 3వేల మందికి అవకాశం కల్పించాడు. డిసెంబర్ 14న డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ లక్కీ డ్రాలో మొదటి ప్రైజ్ కింద రూ. 35 లక్షల ప్లాట్, రెండో ప్రైజ్ కింద స్కూటీ, మూడో ప్రైజ్ కింద టీవీ, నాలుగో ప్రైజ్ కింద ఫ్రిడ్జ్, ఐదో ప్రైజ్ కింద ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ పెట్టారు. ప్రస్తుతానికి 550 మంది వరకు లక్కీ కూపన్లను కొనుగోలు చేశారని, ఆసక్తిగల వారు 9381772741 ఫోన్ నంబర్‌కు సంప్రదించి లక్కీ డ్రాలో పాల్గొనాలని ఆయన కోరారు.
చౌటుప్పల్‌రూరల్, నవంబర్ 2: చౌటుప్పల్‌లో పట్టణానికి చెందిన రాం బ్రహ్మచారి 16 లక్షల విలువైన తన స్వంత స్థలాన్ని లక్కీడ్రా పేరుతో ఇటీవల అమ్మకానికి పెట్టాడు. ఇందుకు సుమారుగా ఐదువేల టోకెన్లను రూ.500 ఒకటి చొప్పున అమ్మినట్టు సమాచారం. ఆదివారం లక్కీడ్రా తీయగా శంకరపల్లికి చెందిన హన్సిక గెలుచుకున్నారు.