చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన పోస్ట్‌కార్డు ఉద్యమానికి మునుగోడు నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మోదీకి పోస్ట్ కార్డుపై చేనేత కార్మికులు యుద్ధాన్ని ప్రకటించారు. తమ వృత్తిపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని నినదిస్తూ నేతన్నలు ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్థానిక నేత కార్మికులతో కలిసి ప్రధాని మోదీకి ఉత్తరం రాశారు.
ఎమ్మెల్యేతోపాటు స్థానిక నేత కార్మికుడు బత్తుల నారాయణ, గుర్రం శ్రీనివాస్, గుర్రం పాండు, కర్నాటి భిక్షపతి, తిరందాస్ రమేష్ తదితరులు ఉత్తరాలు రాశారు. వీరి బాటలో గట్టుప్పల్, చౌటుప్పల్, మర్రిగూడ మండలాలకు చెందిన వేలాది మంది నేత కార్మికులు మోదీకి పోస్ట్‌కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్ సిల్క్ చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రధానికి పోస్టుకార్డులు పంపించారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నేతన్న బత్తుల నారాయణ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ప్రధాని మోదీకి పోస్ట్‌కార్డు రాశారు.