హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): బీజేపీలో ఒకప్పుడు కష్టపడి పనిచేసినవారికి పదవులు వచ్చేవని చెప్పుకొంటారు. ఎవరెవరు కష్టపడ్డారో అధిష్ఠానమే గుర్తిస్తుందని, వారి అర్హతలకు తగిన పదవి ఇస్తుందనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ తరహాలో అధిష్ఠానాన్ని బెదిరిస్తే పదవులు వస్తాయనే అభిప్రాయం మొదలైంది. ఈ సంస్కృతిని మొదలుపెట్టిందే ఈటల రాజేందర్ అని ఆర్ఎస్ఎస్ వాదులు చెప్తున్నారు. పార్టీ లో చేరిన వెంటనే తనకు పదవి కావాలంటూ ఈటల పదే పదే విజ్ఞప్తి చేశారని గుర్తు చేస్తున్నారు. అయినా పట్టించుకోకపోవడంతో ఈటలకు బీజేపీలో అవమానం జరుగుతున్నదని, పార్టీని వీడేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ లీకులు ఇచ్చారని అంటున్నారు.
ఆ తర్వాత ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ పదవి వచ్చినట్టు చెప్తున్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలకు ఇవ్వాలంటూ తన అనుకూల వ్యక్తుల ద్వారా ప్రచారం చేసుకొన్నారని అంటున్నారు. బండి సంజయ్ అసమర్థుడనే ప్రచారం కూడా చేయించారని చెప్తున్నారు. ఇది పనిచేయకపోవడంతో ఏకంగా ఢిల్లీకి వెళ్లి అల్టిమే టం ఇచ్చారని నిజమైన బీజేపీవాదులు గుసగుసలాడుకొంటున్నారు. దీనికి బం డి అసమర్థత, నియంతృత్వ విధానాలు తోడుకావడంతో ఆయనను తొలిగించారని, ఈటలకు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారంటున్నారు. ఇదే కోవలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా పదవి పొందినట్టు విమర్శలు వస్తున్నాయి. మునుగోడులో ఓటమి చెందిన మరుసటి రోజు నుంచే కోమటిరెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తారనే ప్రచారం ఊపందుకున్నది.
ఇటీవలే ఈటల వెంట ఢిల్లీకి వెళ్లి, తనకు కూడా పదవి ఇవ్వాలని అధిష్ఠాన పెద్దలకు స్పష్టం చేసి వచ్చినట్టు చెప్పుకొంటున్నా రు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి చేరిక ఖరారైందని, అన్న వెంకట్‌రెడ్డి రాయబారం నడిపారని లీకులు మొదలయ్యాయి. దీంతో రాజగోపాల్‌రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా ఇప్పటికే ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనకు జాతీయస్థాయిలో పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఢిల్లీ పెద్దలు వినడం లేదు. దీంతో ఇటీవలే ఢిల్లీకి వెళ్లి మరీ నడ్డా, అమిత్ షా, బండి పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. విజయశాంతి వంటి నేతలు కూడా తాము కూడా తక్కువేం కాదంటూ ప్రచారం చేసుకొంటున్నారు.