హైదరాబాద్, జూలై 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 14 బ్రాహ్మణ సంఘాలతో బ్రాహ్మణ ఐక్యతా వేదికను ఏర్పాటుచేశారు. బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్లోని సాయిరాం ఫంక్షన్హాల్లో 14బ్రాహ్మణ సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజం కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ఈనెల 23న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో అభినందన సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ చైతన్యయాత్ర చేపట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను బ్రాహ్మణ సమాజానికి వివరించాలని నిశ్చయించారు.
బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర అధ్యక్షుడు శేషం రఘుకిరణాచార్యులు, నియోగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండారు రాంప్రసాదరావు, మంగపతిరావు, బ్రాహ్మణ భవనం అధ్యక్షుడు గిరిప్రసాదశర్మ, ధూపదీప నైవేద్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిట్టూరి సతీశ్‌శర్మ, బాలచంద్ర శర్మ, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యులు నారాయణస్వామి, విష్ణుదాస్ గోపాల్‌రావు, వైష్ణవ సంఘం నాయకులు చెరుకుపల్లి రాహుల్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా 10ఎకరాల స్థలంలో బ్రాహ్మణ సదనం నిర్మించినట్లు చెప్పారు. బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర అధ్యక్షుడు శేషం రఘుకిరాణాచార్యులు మాట్లాడుతూ ఆగస్టు మొదటివారంలో మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల జోగులాంబ ఆలయం నుంచి ఉమ్మడి పది జిల్లాల్లో బ్రాహ్మణ చైతన్యయాత్రను నిర్వహించనున్నట్లు చెప్పారు.