e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home టాప్ స్టోరీస్ ఎదురులేని మనిషి!

ఎదురులేని మనిషి!

  • 42 ఏండ్లపాటు అమిస్తాపూర్‌ గ్రామ సర్పంచ్‌
  • ఐదుసార్లు ఏకగ్రీవం.. మూడుసార్లు గెలిచి..
  • ప్రజాసేవకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు
  • తాజాగా జీవన సాఫల్య పురస్కారం అందజేత
  • పదవులకే వన్నెతెచ్చిన పాలమూరువాసి వీరస్వామి

భూత్పూర్‌/ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 26: కెంద్యాల వీరస్వామి. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలంలోని అమిస్తాపూర్‌ వాసి. వరుసగా ఎనిమిదిసార్లు.. 1957 నుంచి 2001 వరకు 42 ఏండ్లపాటు (రెండేండ్ల అధికారుల పాలన మినహా) సర్పంచ్‌గా పనిచేశారు. ప్రజాసేవతో ఆ పదవికే వన్నెతెచ్చారు. 90 ఏండ్ల వయసులో అరుదైన గౌరవం పొందారు. ఒక గ్రామానికి 42 ఏండ్లు సర్పంచ్‌గా కొనసాగినందుకు తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నారు. వరుసగా ఎనిమిదిసార్లు సర్పంచ్‌గా ఎన్నికై ప్రజాసేవకు అంకితమైనందుకు జీవనసాఫల్య పురస్కారాన్ని సైతం అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌ తార్నాకలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధినేత చింతపట్ల వెంకటాచారి.. వీరస్వామికి ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.

అక్కడే సమస్యల పరిష్కారం
ఒక మనిషి ప్రజాసేవకు అంకితమైతే ప్రజలు ఆ వ్యక్తిని ఎలా చూసుకుంటారో వీరస్వామిని చూస్తే తెలుస్తుంది. అమిస్తాపూర్‌కు చెందిన వీరస్వామి 1931లో జన్మించారు. తల్లిదండ్రులు కెంద్యాల శంకరప్ప, నర్సమ్మ. వీరస్వామి రెండో సంతానం కాగా.. ఆయనకు సోదరితోపాటు సోదరులు నర్సింహులు, నారాయణ, హన్మంతయ్య, సహదేవ్‌ ఉన్నారు. కుటుంబమంతా వ్యవసాయం, పాడి సంపదపై ఆధారపడేది. చిన్నప్పటి నుంచే వీరస్వామి గ్రామంలో చిన్నచిన్న పంచాయితీలను పరిష్కరించడం, గొడవలు జరుగకుండా చూసుకోవడంపై దృష్టి పెట్టేవారు. వీరస్వామి 5 పర్యాయాలు సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. మూడుసార్లు పోటీలో నిలబడి గెలుపొందారు. 2001లో బీసీ మహిళకు రిజర్వు కావడంతో వీరస్వామి పోటీనుంచి తప్పుకొన్నారు. అప్పుడు కూడా ఆయన బలపరిచిన (చెన్నమ్మ) వ్యక్తే సర్పంచ్‌గా గెలిచారు. 2006లో (కెంద్యాల శ్రీనివాసులు)నూ ఆయన మద్దతు అభ్యర్థే గెలుపొందారు.

- Advertisement -

ఠాణా మెట్లు ఎక్కనివ్వలేదు
వీరస్వామి సర్పంచ్‌గా పనిచేసిన 42 ఏండ్లు.. రోజూ ఉదయం 7.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లేవారు. ఏ సమస్య వచ్చినా పంచాయతీలోనే పరిష్కరించేవారు. ఈ పంచాయితీని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనివ్వకుండా అక్కడే పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. అభివృద్ధి కోసం గ్రామంలోని ముఖ్యమైన వ్యక్తులతో చర్చించేవారు. వివాదాలకు దూరంగా ఉండేవారు. గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి తన సొంత పొలాన్ని దానంగా ఇచ్చారు. పక్కపక్కనే ఉన్న భూత్పూర్‌, అమిస్తాపూర్‌ గ్రామాల మధ్య రాధాకృష్ణ హైస్కూల్‌కు 1971లో ఓ సొసైటీని ఏర్పాటుచేశారు. పాఠశాల భవన నిర్మాణంలో ప్రధానపాత్ర పోషించారు. జిల్లా ఉన్ని సంఘం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1947 స్వాతంత్య్ర పోరాటంలో, రజాకార్లను ఎదురించేలా హిందువులను సంఘటితం చేసేందుకు జిల్లాలోనే మొదటిసారి ఆర్య సమాజాన్ని ఏర్పాటుచేశారు. 1957 ఆర్య సమాజం కోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించారు. అది ఇప్పటికీ ఉన్నది. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా పలువురు వీరస్వామి సేవలను కొనియాడారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement