Urination | సూర్యాపేట : వర్షాకాలంలో ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నారా..? అయితే బీ కేర్ఫుల్. అజాగ్రత్తగా ఉన్నారంటే ప్రాణాలకే ప్రమాదం. ఎందుకంటే.. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద మూత్ర విసర్జన చేయడం ప్రమాదకరం. విద్యుత్ సరఫరా జరిగే ఏరియాల్లో మూత్ర విసర్జన చేయడమంటే ప్రాణాల మీదికి కొని తెచ్చుకున్నట్టే. ఇలా చేయడం వల్ల విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. దీనికి ఉదాహరణే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇవాళ చోటు చేసుకున్న ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న వాణిజ్య భవన్ పక్కనే ఓ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అయితే ఆ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకోగా, అప్పటికే అతను ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని పట్టణానికి చెందిన దంతాల చక్రాధర్ (50) గా గుర్తించారు.