హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తిని చూసి చలించిపోయారు.. అతడికి కొత్త జీవితాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్. రోజుమాదిరిగానే గురువారం హైకోర్టుకు వెళ్తున్న చీఫ్ జస్టిస్.. చింపిరి జుట్టు, మాసిపోయిన దుస్తులతో ఫుట్‌పాత్‌పైన పడి ఉన్న ఓ వ్యక్తిని గమనించారు. అతడి దీనస్థితిని చూసి ఆవేదన చెందారు. ఆ వ్యక్తికి తక్షణమే తగిన సహాయం అందించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డిని ఆదేశించారు. వెంటనే స్పందించిన గోవర్ధన్‌రెడ్డి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆ అపరిచిత వ్యక్తిని ఆదుకోవాలని సిటీ సివిల్ కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి కే మురళీమోహన్ను ఆదేశించారు. ఈ మేరకు మురళీమోహన్తోపాటు మీర్‌చౌక్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తిని గుర్తించి, అతడికి స్నానం చేయించారు. కొత్త దుస్తులు తొడిగారు. అనంతరం చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.