హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ తెలంగాణ నేతల ‘గాలి’ మాటల్లో.. ఎలాంటి వాస్తవం లేదని రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి వీకే సింగ్ వారి ‘గాలి’ తీశారు. తెలంగాణకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లను మంజూరు చేయలేదని తెలి పారు. దీంతో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష మరోసారి వెల్లడైంది. తెలంగాణ బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్.. దేశంలో ఐదేండ్లలో మంజూరైన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల సంఖ్య? తెలంగాణకు మంజూరైనవి ఎన్ని? వాటి నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నించారు. దీనికి కేంద్రంమంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ.. గత ఐదేండ్లలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వద్ద అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్ వద్ద దేశీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపామని చెప్పారు. గత ఐదేండ్లలో పక్యోంగ్, కన్నూర్, కలబురగి, ఒర్వకల్, సింధుదుర్గ్, ఖుషీనగర్, దోనీపోలో, ఇటానగర్‌లో ఎనిమిది గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు ప్రారంభమయ్యాయని వివరించారు. ఈ సమాధానంలో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. దీంతో ఇన్నాళ్లూ ఇక్కడి బీజేపీ నేతలు కొత్త ఎయిర్పోర్టులంటూ ఊదరగొడుతున్నది.. ఉత్త గాలిమాటలే అని తేలిపోయింది.