Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మెగా అభిమానులను కూడా ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చిరంజీవి క్లాసిక్ స్టైల్, వింటేజ్ ఛార్మ్తో కనిపించడం అభిమానులకు పెద్ద పండుగగా మారింది. ఈ సినిమా విజయోత్సాహం మధ్య ఒక అభిమాని చేసిన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ సినిమాలతో తన బాల్యం, యవనాన్ని గుర్తు చేసుకుంటూ ఓ వీరాభిమాని చిరంజీవికి ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో చిరంజీవి సినిమాలు తన జీవితానికి ఇచ్చిన ప్రేరణ, కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసిన అనుభవాలు, అభిమానిగా ఎదిగిన ప్రయాణాన్ని భావోద్వేగంగా వివరించాడు.
ఓయ్ ప్రసాదు… ఇదుగో నిన్నే..
‘నిన్నేనయ్యా ప్రసాదూ. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏడు పదుల వయసులో జనాలు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్ రేలు, రక్త పరీక్షలు, డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాలంలో హుక్కు స్టెప్పు హుక్కు స్టెప్పు అంటూ డ్యాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని నీ ప్లాన్. అసలు నాకొకటి అర్థం కాక అడుగుతాను. చిన్నప్పుడు యముడికి మొగుడు పాటను బ్లాక్ అండ్ వైట్ టీవీలో గుడ్లప్పగించి చూస్తుంటే మా నాన్న భుజం మీద చరిచి చెప్పేవాడు “ఒంట్లో స్ప్రింగులు ఉన్నోడే చిరంజీవి అని”. అప్పుడర్థమయ్యేది కాదు. చెడ్డీలకు బటన్లు ఊడిపోతే పిన్లు పెట్టుకుని స్కూలుకు పరిగెత్తే మధ్య తరగతి జీవితాల్లో బ్లాక్ టికెట్లు కొనే వైరస్ తెచ్చింది నీ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు సినిమాలే. క్లాసులో బెంచీల మీద నీ డైలాగులు అప్పజెబుతూ టీచర్ కు దొరికిపోతే వీపు మీద కర్ర దెబ్బలు ఎందుకు నొప్పనిపించలేదో తెలుసా? బోలో బోలో బోలో రాణి క్యా చాహీయే అంటూ నువ్వు ఖాకీ కోటుని ఎగరేసి, తిరగేసి డాన్సు చేయడం గుర్తుకు వస్తే మాస్టారి బెత్తం దెబ్బ ఒక లెక్కా’
‘సరే చిన్నప్పటి ముచ్చట్లు ఇప్పుడెందుకులే ప్రసాదు విషయానికి వద్దాం. ముందు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకో. నీ మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటున్న వీడియోలు ఆడియోలు మాకు చూపెట్టకు. వాళ్ళు నిన్ను తాత అంటే ఒప్పుకునే పరిస్థితిలో మేం లేం. ఎందుకంటే నువ్వు మాకెప్పటికీ కాళీవి, ఆటో జానీవి, రాజువి, ఇప్పుడీ ప్రసాదువి. అంతే నో డిబేట్. శశిరేఖతో ప్రేమలో పడే సీన్లలో నీలో ఆ పెళ్లి కాని కళని మొహంలోకి ఎలా తీసుకొచ్చావో ఎంత రాకెట్ సైన్స్ చదివినవాడైనా చెప్పలేడు. నా పందెం పది వేలు. అమాయకత్వం, తింగరితనం కలగలసి నీ టైమింగ్ లో ప్రేక్షకులు మునకలు వేస్తుంటే ఒక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంత సిల్లీగా ఉంటాడానే లాజిక్ మాకెందుకు గుర్తుకు వస్తుంది చెప్పు. గ్రేసుకే బాసులా ఒళ్ళు వయ్యారంగా తిప్పుతూ పక్కన నయనతార ఉన్న సంగతే మర్చిపోయేలా చేస్తే ఇద్దరి మధ్యా వయసు వ్యత్యాసాన్ని ఎలా గుర్తిస్తాం. అంత చిన్న పిల్లలు ఈ పెద్దాయన ప్రసాద్ కొడుకు కూతురాని నా కొడుక్కు అనిపించలేదంటే దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్ అనాలా లేక మాస్ భాషలో దొంగ సచ్చినోడు అనాలా నాకైతే అర్థం కాలేదు’
‘చెప్పుకుంటూ పోతే ఇది ఆగదులే కానీ ఆపేద్దాం. భోళా శంకరప్పుడు నిన్ను ఆడిపోసుకున్న నేనే ఇప్పుడీ మాటలు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పు చేసినవాడిని అవుతాను. అందుకే ఇలా బయట పడుతున్నా. చాలా కాలంగా థియేటర్ కు దూరంగా ఉన్న అమ్మా నాన్నను నిన్ను చూసి రమ్మని పంపించా. వచ్చిన తర్వాత అమ్మ ఆపకుండా పది నిముషాలు పొగుడుతూనే ఉంది. ఇంకోసారి చూస్తావా అంటే ఠక్కున ఔననేలా ఉంది. కానీ టికెట్ రేట్లు చూసి వద్దులే అంటుంది. అది వేరే సంగతి. మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ప్రసాదూ. ఇక ఉంటా మరి. నీతో పోల్చుకుంటే ఏజులో రేంజులో బచ్చాగాడిని, ఏకవచనంతో పిలిస్తే నువ్వు ఏమనుకోవు కానీ ఇక్కడ డౌట్ పడుతున్న వాళ్లకు చెప్పాలిగా. అన్న, నాన్న, తమ్ముడు వీళ్ళను గారు అనడం నాకు తెలియదు. నా ఒంట్లో రక్తాన్ని, గుండెని గారు అని పిలవను. కుటుంబమూ అంతే. మాలో కలిసిపోయిన నువ్వూ అంతే. ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను ఇంకో వంద సినిమాలు చేయమని నేను అడగను. వచ్చినవాళ్లందరికీ భోళాగా మాటిచ్చి సినిమాలు చేయకుండా సత్తా ఉన్నోళ్లకే వరాలు ఇచ్చే వరప్రసాద్ లా ఉండు. అదొక్కటి చాలు. ఉంటా మరి, ఇట్లు నిన్నింకా కలవలేకపోయిన ఒక మాములు అభిమాని.