
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలో బౌద్ధ సంస్కృతి పరిరక్షణకు జాతీయ బౌద్ధబోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య, ఐసీసీఆర్ బుద్ధవనం, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పర్యాటకభవన్లో రెండో ప్రాంతీయ బౌద్ధ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ.. బౌద్ధ పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు. సదస్సులో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీఎస్టీడీసీ ఎండీ మనోహర్రావు తదితరులు పాల్గొన్నారు.