కాటారం : తన బిడ్డ చావుకు కారణమై అల్లుడిపై(Son-in-law) ప్రతీకారం తీర్చుకోవాలని అత్త(Mother-in-law) పగతో రగలిపోయింది. అల్లుడిని అంతమొందించేకు సమయం కోసం ఎదురు చూసింది. తన కూతరిని కడతేర్చిన దుర్మార్గుడిని ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకొని సుపారీ ఇచ్చి మరీ అంతం మొందించేకు ప్రయత్నించించింది. ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళ్తే..అల్లుడిని హత్య చేయించేందుకు రూ.10 లక్షల సుఫారీ(Sufari) ఇచ్చి కుట్ర పన్నిన అత్తతో పాటు మరో నలుగురిని కాటారం పోలీసులు శుక్ర వారం అరెస్ట్ చేశారు.
జయశంకర్ భూపాపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ- గుమ్మళ్లపల్లి మార్గంలో ఈ నెల 23న ప్రైవేట్ కళాశాల నిర్వాహకుడు చిగురు గణేశ్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. కాటారం సీఐ నాగార్జున రావు కథనం ప్రకారం.. గారెపల్లి గ్రామానికి చెందిన చింత రాజేశ్వరి కుమార్తె సంధ్యకు 2017లో ఒడిపిలవంచకు చెందిన చిగురు గణేశ్‌తో వివాహం జరిగింది. అదనపు కట్నం వివాదాల నేపథ్యంలో 2023 జూలై 31న భార్య సంధ్యను గణేశ్ హత్య చేశాడు.
ఈ కేసులో గణేశ్ జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో అల్లుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని రాజేశ్వరి నిర్ణయించుకుంది. కరీంనగర్లో నివసిస్తున్న ధరంసోత్ రవీందర్ నాయక్‌ను సంప్రదించి రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ.లక్షతో పాటు గణేశ్ ఫొటోను ఇచ్చింది. అనంతరం రవీందర్ నాయక్ మరో ముగ్గురిని కలుపుకుని శుక్రవారం ఒడిపిలవంచలో రెక్కీ నిర్వహించారు. మరుసటి రోజు కారుచెడి పోయినట్లు నమ్మించి గణేశ్‌ను సహాయం కోరగా, అతడు కారు తోస్తుండగా నాగార్జున్ కత్తితో దాడి చేశాడు.
గణేశ్ కేకలు వేయడంతో రైతులు రావడాన్నిగమనించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మిగిలిన డబ్బుల కోసం ఈ నెల 26న రాజేశ్వరి ఇంటి వద్ద నిందితులు చర్చిస్తుండగా సమా చారం అందుకున్న సీఐ నాగార్జున రావు, ఎస్సై శ్రీనివాస్, ఎస్సై-2 మహేశ్, నరేశ్ దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో సుపారీ తీసుకొని హత్యాయత్నం చేసినట్లుగా నిందితులు అంగీకరించడంతో ప్రధాన నిందితురాలు రాజేశ్వరితో పాటు ధరంసోత్ రవీందర్ నాయక్, దామోదర్, నాగార్జున్, ప్రశాంత్‌ను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ సూర్య నారాయణ అభినందిం చారు.