ఉప్పల్, డిసెంబర్ 29: కుటుంబ కలహాలతో మెట్రోరైల్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన ముప్పిడి నరేశ్ (28) హైదరాబాద్ ఉప్పల్‌లోని సరస్వతికాలనీలో ఉంటూ మెట్రోరైల్ సిగ్నల్ విభాగంలో పనిచేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కాగా, శనివారం సీమంతం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమం కోసమే ఆమె కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.
సీమంతానికి తమ కుటుంబాన్ని ఎందుకు పిలువలేదంటూ నరేశ్ శుక్రవారం భార్యకు వీడియో కాల్ చేసి గొడవ పడినట్టు సమాచారం. ఇదే విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాదన జరగగా, నరేశ్ మనస్తాపం చెందాడు. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఆమె పక్కింటి వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి చూసేలోపే ప్రాణాలు విడిచాడు.