అచ్చంపేట రూరల్, సెప్టెంబర్ 17 : ఆస్తి తగాదాల నేపథ్యంలో మొదటి భార్య, పిల్లల చేతిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి బాల్నారాయణ (68)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సాయిలమ్మకు బాలమ్మ, సైదమ్మ, వెంకటయ్య సంతానం. రెండో భార్య కృష్ణమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. 20 ఏండ్లకుపైగా సాయిలమ్మను దూరం పెట్టి రెండో భార్యతో ఉంటున్నాడు.
ముగ్గురు కూతుళ్లు చిట్టెమ్మ, శివలీల, స్వప్నకు రెండెకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి భూమి పట్టాలను పంచాడు. దీంతో ఆస్తి తగాదాలు మొదలై దాడులు చేసుకోవడం.. పోలీస్స్టేషన్లో కేసుల వరకు వెళ్లింది. ఆస్తి పంపకంలో అన్యాయం చేశాడని కక్ష పెంచుకొన్న పెద్ద భార్య సాయిలమ్మ హైదరాబాద్లో ఉంటున్న కొడుకు వెంకటయ్య, కోడలు అమృతతోపాటు కూతుళ్లు బాలమ్మ, సైదమ్మ, అల్లుళ్లకు ఉప్పందించింది. దీంతో వారంతా గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న బాల్నారాయణపై రోకలిబండతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.