కోరుట్ల, మే 4: చాలా సందర్భాల్లో అదనపు కట్నం, అత్తామామల వేధింపులు తాళలేక భార్యలు అత్తింటి ఎదుట నిరసనలు చేయడం చూస్తుంటాం.. కానీ ఇందుకు భిన్నంగా కోరుట్లలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రావాలంటూ మహిళాసంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులతో కలిసి అత్తింటి వద్ద నిరసనకు దిగిన ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలోని ప్రకాశంరోడ్డు కాలనీకి చెందిన శివానితో అదే ప్రాంతానికి చెందిన గాజుల అజయ్‌కి నాలుగేండ్ల క్రితం వివాహమైంది. భార్య గర్భందాల్చిన తర్వాత అజయ్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. ఈ క్రమంలో శివానికి బాబు జన్మించాడు. అత్తామామలతో గొడవల కారణంగా కొద్ది నెలల క్రితం శివాని పుట్టింటికి వెళ్లింది.
గల్ఫ్ నుంచి తన భార్యకు పలుమార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోకపోవడంతో 10 నెలల క్రితం అజయ్ స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం భార్యను కాపురానికి పంపించాలని కోరుతూ అత్తింటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగా డు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భార్య కోసం గల్ఫ్ నుంచి కోరుట్లకు వచ్చి బట్టల దుకాణంలో పని చేస్తున్నానని, తాను తల్లిదండ్రులకు ఏకైక సంతానమైనా వేరు కాపురం పెట్టడానికి సిద్ధమని తెలిపాడు. తన భార్యకు ఎన్నిసార్లు నచ్చజెప్పినా.. కాపురానికి రాకపోవడమే కాకుండా కుమారుడిని కూడా చూపించలేద ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరుకుటుంబాల సభ్యులను సముదాయించి స్టేషన్‌కు తరలించారు. అత్తింటివారితో తనకు ప్రా ణహాని ఉందని, తన బంగారు నగలు లాక్కొన్నారని, మానసికంగా హింసించారని.. అక్కడికి వెళ్లనని శివాని తేల్చిచెప్పింది.