సిద్దిపేట : జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిలోని తాడూరు క్రాసింగ్ సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టును (Culvert) ఢీకొని ఓ యువకుడు(Lorry driver) మృతి చెందాడు. సిద్దిపేట(Siddipet) జిల్లా చేర్యాల మండంఆకునూరు గ్రామానికి చెందిన ఎండీ.యాకూబ్ పాషా(29) అనే యువకుడు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్ పై సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జాతీయ రహదారి పై నిర్మిస్తున్న కల్వర్టు వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో యువకుడు కల్వర్టును ఢీకొని మృతి చెందాడు.
కల్వర్టు వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై కుటుంబ సభ్యులు, లారీ డ్రైవర్లతో కలిసి సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..పాషా కుటుంబానికి రూ.15లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని లేని పక్షంలో మరిన్ని ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.