PM Gati Shakti Portal | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ సంక్షోభానంతరం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ‘జాబ్ ఎట్ యువర్ హోమ్ టౌన్’ పేరుతో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను, మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నది. ఉద్యోగార్థులు లొకేషన్, సెక్టార్, ఎంప్లాయర్, పేస్కేల్, అససరమైన నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలను ఫిల్టర్ చేసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ అభివృద్ధి చేస్తున్నది. పీఎం గతిశక్తి పోర్టల్‌లో ఉద్యోగాల డాటాను మ్యాపింగ్ చేస్తున్నది.
ఎంప్లాయర్స్ను, ఉద్యోగార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లా నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ పనిచేస్తుంది. ఇప్పటికే 41 లక్షల ఎంప్లాయర్స్, కోటికిపైగా ఉద్యోగార్థులు ఎన్‌సీఎస్‌లో నమోదయ్యారు. పీఎం గతిశక్తిని ఎన్సీఎస్ పోర్టల్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను జియో-ట్యాగింగ్ చేస్తున్నారు. ఉద్యోగార్థులు తమకు 20-40 కి.మీ పరిధిలో ఉన్న ఉద్యోగావకాశాలను గుర్తించేలా ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. జమ్ముకశ్మీర్, గుజరాత్ రాష్ర్టాలు ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాయి.