పెంబి, సెప్టెంబర్ 11 : నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఎంగ్లాపూర్ గ్రామంలో కట్టెలకు మృతదేహాలను కట్టి దోత్తివాగు దాటించిన హృదయ విధారక ఘటన గురువారం చోటుచేసుకున్నది. నాగాపూర్కు చెందిన అలకుంట ఎల్లయ్య, అలకుంట లక్ష్మి ఉపాధి నిమిత్తం ఎంగ్లాపూర్లో ఉంటున్న వారి బంధువైన బండారి వెంకటి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బుధవారం అలకుంట ఎల్లయ్య, అలకుంట లక్ష్మి, బండారు వెంకటి చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
వెంటనే వారు మంచె కిందకు వెళ్లారు. అక్కడే పిడుగు పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో గురువారం పోస్టుమార్టం చేయాల్సి ఉంది. దవాఖానకు వెళ్లాలంటే మధ్యలో దొత్తివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లయ్య, లక్ష్మి మృతదేహాలను కూడా తమ సొంత గ్రామమైన నాగాపూర్ వెళ్లాలంటే కూడా దొత్తివాగు దాటాలి.
చేసేదేమి లేక గురువారం ఉదయం రెవెన్యూ, పోలీసు, వైద్య సిబ్బంది స్థానికుల సహాయంతో వాగుదాటి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు చెందిన వైద్యుడు వంశీ ఘటన స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఎల్లయ్య, లక్ష్మి మృతదేహాలకు చద్దరు చుట్టి కర్రలకు కట్టి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న దొత్తివాగు దాటించి నాగాపూర్కు తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.