యాదాద్రి, సెప్టెంబర్ 14 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని బుధవారం అత్యంత వైభవంగా జరిపించారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ చేపట్టి నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి వెండి మొక్కు జోడు సేవలో భాగంగా తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. అనంతరం తిరువారాధన చేపట్టి స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఖజానాకు రూ.9,14,729 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.