ఆదిలాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సర్కారు బడిని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) సర్పంచ్ మీనాక్షి గాడ్గే వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పాఠశాలకు పిల్లలను పంపించే తల్లిదండ్రులకు దుస్తులు పెట్టి సన్మానించడంతోపాటు చిన్నారులకు స్కూల్బ్యాగు, పలక అందిస్తున్నారు.
ఉపాధ్యాయులు, పంచాయతీ, అంగన్వాడీ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పిల్లలను సర్కారు బడికి పంపాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు చీర, ప్యాంట్, షర్టు కానుక ఇవ్వడంతోపాటు చిన్నారులకు బ్యాగు, పలక, బలపం అందిస్తున్నారు. రెండు రోజుల్లో 15 మంది పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించినట్టు సర్పంచ్ తెలిపారు. గ్రామంలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులను నిషేధించడంతోపాటు ప్రైవేటు స్కూళ్లకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్టు ఆమె ప్రకటించారు.