నిజామాబాద్ : ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న మానవీయ విలువలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తున్నారు. స్వలాభం కోసం వివాహ బంధాలను, పేగు బంధాలను కూడా తృణప్రాయంగా వదిలేస్తున్నారు. నిలువెల్లా స్వార్థం నిండిన కొందరు మనుషులు కనిపెంచుకున్న తమ పిల్లలను కిరాతకంగా చంపడానికి కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తాను సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కన్నకూతునే కడతేర్చాడు. వివరాల్లోకి వెళ్తే.. పాండురంగ అనే వ్యక్తి మహారాష్ట్రలోని కేరూరు సర్పంచ్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అక్కడి నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తి సర్పంచ్‌గా పోటీ చేయడానికి అర్హత లేదు.
కానీ పాండురంగకు మాత్రం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎలాగైనా సర్పంచ్‌గా పోటీచేయాలని నిర్ణయించుకున్న అతడి మనసులో దుర్బుద్ధి పుట్టింది. తన పెద్ద కూతురును చంపేస్తే ఇంకా ఇద్దరు పిల్లలే ఉంటారు కాబట్టి పోటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని.. కన్నబిడ్డ హత్యకు పథకం వేశాడు. పథకం ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లికి పెద్దకుమార్తె ప్రాచీని తీసుకొచ్చాడు.
కన్నతండ్రి వెంట తీసుకెళ్తున్నాడనే సంతోషంతో, తోడుగా ఉన్నాడనే ధైర్యంతో ఆ అమాయకురాలు అతడి వెంట వెళ్లింది. అక్కడ నిజాం సాగర్ కాలువలో నీళ్లను చూద్దామనే నెపంతో కాలువ ఒడ్డుకు తీసుకెళ్లాడు. తండ్రితో కలిసి ఆనందంగా నీటి పరవళ్లను చూస్తున్న ప్రాచీపట్ల తండ్రి నమ్మక ద్రోహం చేశాడు. ఆమెను అమాంతం కెనాల్లోకి తోసి ఇంటికి వెళ్లాడు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.