ఖానాపూర్, నవంబర్ 30 : మక్కజొన్నకు నీరు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు కరెంటు షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ఖానాపూర్ మండలం సుర్జాపూర్‌కు చెందిన రైతు పన్నెల వెంకట్రాములు(54) తనకున్న ఐదెకరాల్లో వరి, మక్కజొన్న సాగుచేస్తున్నాడు. వరి పంట ముగియగా.. మక్క పంట చివరి దశలో ఉన్నది.
శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మక్కజొన్నకు నీరు పెట్టడానికి చేను వద్దకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఉదయం చేను వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. చేనుకు నీరు పెట్టడానికి మోటర్‌ను ఆన్ చేయగా షాక్ తగిలి మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.