ఆ దారిలో..
వట్టిపోయిన చెరువులుండె..
ఎండిపోయిన కాలువలూ ఉండె..
పడావుబడ్డ బోర్లు, బావులుండె..
భూగర్భం అడుగంటిపోయుండె..
ఇప్పుడా దారిలో..
పచ్చని పైరులు పలకరిస్తున్నయ్
చెర్లు నిండినయ్.. బోర్లు పోస్తున్నయ్
కాలువలు నిండుగా పారుతున్నయ్
కారణం కాళేశ్వర జలాల పరవళ్లు!
ఎక్కడి మేడిగడ్డ బరాజ్!
ఎక్కడి రావిపహాడ్ చెరువు!
ఇది 405 కిలోమీటర్ల జల జైత్రయాత్ర!
కాళేశ్వరం లిఖిస్తున్న నవ సస్యచరిత్ర!!
Kaleshwaram | సూర్యాపేట, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఎక్కడి మేడిగడ్డ! ఎక్కడి పెన్‌పహాడ్! ఏకంగా 405.45 కిలోమీటర్ల దూరం. ఇంతదూరం నీళ్లను పారించాలంటే మాటలా? కానీ, వరుసగా ఐదో ఏడాదీ కాళేశ్వర జలాలు మేడిగడ్డ నుంచి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం మాచారం రావి చెరువు వరకు చేరాయి. 2019లో తొలిసారి రావి చెరువును ముద్దాడిన జలాలు.. ఆ తర్వాత ఏటా ఈ ప్రాంతాన్ని పావనం చేస్తున్నాయి. తాజాగా రెండు రోజుల క్రితం కూడా కాళేశ్వరం నీళ్లు గమ్యాన్ని చేరుకొన్నాయి. దీంతో చెరువు కింద ఉన్న 250 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. పక్కనున్న ఆరు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లు, బావుల్లో నీళ్లు పెరిగి మరో 200 ఎకరాలకు పైనే సాగు చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పట్టుబట్టి శ్రీరాంసాగర్ కాల్వపై ఓ చోట టన్నెల్ పూర్తి చేయించటంతో సీఎం కేసీఆర్ ఆశయం మేరకు చివరి చెరువు నిండిందని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో కమీషన్ల కోసం ఎస్సారెస్పీ కాల్వలు తవ్వించారు తప్ప.. ప్రాజెక్టు లేదు. అది కూడా కాసుల కక్కుర్తి కోసం ఎక్కడ మెతక ఉంటే అక్కడ కాల్వ తవ్వారే తప్ప, నీళ్లు తీసుకురావాలనే ధ్యాస లేదు. దానికి ఉదాహరణే సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో రెండు పక్కలా కాల్వలు పూర్తి చేసి మధ్యలో గెయిల్, హెచ్‌పీసీఎల్ పైపులైన్లు. పైప్లైన్లు అడ్డు వచ్చాయని సొరంగ మార్గం కోసం కనీస ప్రయత్నం చేయలేదు’ అని రైతులు నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. కాళేశ్వరం పూర్తి కావస్తున్న సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కాల్వల వెంట పర్యటిస్తుండగా గెయిల్ పైపులైన్ కారణంగా నిలిచిపోయిన కాల్వలను గుర్తించి వాటిని తవ్వించేందుకు ఎంపీలతో లేఖలు ఇప్పించి అనుమతులు తెప్పించారని, రూ.3కోట్లతో 2019లో పనులు పూర్తయ్యాయని, నాటి నుంచి మాచారం రావి చెరువు కాళేశ్వరం జలాలతో నిండుతున్నదని అన్నదాతలు సంతోషంగా చెప్తున్నారు.
405.45 కిలోమీటర్ల నీటి ప్రవాహం
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట జిల్లా పరిధిలోని తిరుమలగిరి మండలంలో డీబీఎం 71 వరకు 343 కిలోమీటర్లు. డీబీఎం 71 నుంచి పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలోని రావి చెరువుకు 62.45 కిలోమీటర్లు. అంటే మొత్తంగా ప్రాజెక్టు నుంచి చెరువు వరకు 405.45 కిలోమీటర్ల దూరం కాళేశ్వరం నీళ్లు ప్రవహిస్తున్నాయి.
50 ఏండ్ల తర్వాత నిండిన చెరువు
నీళ్లు లేక రావి చెరువు 50 ఏండ్లపాటు ఒట్టిపోయింది. ఎప్పుడో ఒకసారి భారీ వర్షాలు వస్తే తప్ప సగం చెరువు నిండేది కాదని గ్రామస్థులు చెప్తున్నారు. అలాంటిది ఐదేండ్లుగా కాళేశ్వరం జలాలతో వరుసగా జలకళతో అలుగు పోస్తున్నది. దీంతో ఈ చెరువు కింద ఉన్న 250 ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. మండలంలోని మాచారం, పెన్‌పహాడ్, అనంతారం, పొట్లపహాడ్, భక్తళాపురం, ధర్మాపురం, గాజులమల్కాపురం గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి మరో 200కు పైగా ఎకరాల్లో బావులు, బోర్లతో సాగు చేస్తున్నారు. గతంలో ఈ భూముల్లో వానకాలంలో వాతావరణం సహకరిస్తే ఏదో ఒక పంట వేసేవాళ్లమని రైతులు తెలిపారు.
మా బాధలు తీరాయి
మాచారంలోని రావి చెరువు పెన్‌పహాడ్ మండలంలోనే అతిపెద్దది. మా చెరువు నిండలేదని మా తాతలు కూడా చెప్పారు. నాకున్న రెండు ఎకరాలను సాగు చేసేందుకు బోర్లు వేసి నానాతంటాలు పడ్డా. అయినా అరెకరం కూడా వరి పండకపోయేది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయటం, ప్రధాన కాల్వపై మంత్రి జగదీశ్‌రెడ్డి టన్నెల్ పూర్తి చేయటంతో రావి చెరువుకు ఐదేండ్లుగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. రావి చెరువుకు నీళ్లు తీసుకొస్తానని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్తే మా ఊరోళ్లం ఎవ్వరం నమ్మలేదు. కానీ, నేడు పంటలు పండించుకుంటున్నాం.
– వీరబోయిన లింగయ్య, రైతు, మాచారం, పెన్‌పహాడ్ మండలం
నీటి గోస పోయింది
కాళేశ్వరం నుంచి చివరి ఆయకట్టు రావి చెరువు వరకు జలాలు రావటంతో మా ఊరే కాదు.. చుట్టుపక్కల ఊర్లకు కూడా నీటి గోస తప్పింది. ఐదేండ్ల క్రితం వరకు సాగునీరే కాదు.. తాగునీళ్లు కూడా దొరక్కపోయేది. కానీ నేడు పొలాలు, ఇండ్లల్లో నీటి ప్రవాహం కొనసాగుతున్నది. గతంలో వర్షాలకు మా ఊరి రావి చెరువు నిండినట్టు నేను చూడలేదు. ఇప్పుడు వేసవిలో కూడా కాళేశ్వరం నీళ్లు కనిపిస్తున్నాయి.
– చిత్రం వేణుగోపాల్‌వర్మ, మాచారం, పెన్‌పహాడ్ మండలం