కొల్చారం, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఓ దివ్యాంగుడు తన నెల పింఛన్ విరాళం అందజేశాడు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం ధాన్యం కొనుగోళ్ల కేంద్రం ప్రారంభించడానికి సంగాయిపేటకు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుడు బ్యాక మల్లయ్య తన నెల పింఛను రూ.4 వేలు ఎమ్మెల్యేకు అందించి కేసీఆర్కు ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కలను సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీపై మల్లయ్య చూపిన అభిమానాన్ని కొనియాడారు. 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కోరారు. రంగంపేట నుంచి సంగాయిపేటకు వెళ్తుండగా జోగిపేట- మెదక్ రోడ్డు పక్కన ఓ గోడపై పెయింటర్ బీఆర్ఎస్ రజతోత్సవ మహా సభ వాల్పోస్టర్ వేస్తూ కనిపించగా ఎమ్మెల్యే కారు దిగి పరిశీలించారు.
పెయింటర్ బార్డర్ గీసి తెల్ల రంగు వేసి సిద్ధ్దంగా ఉంచిన గోడపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వయంగా బ్రష్ చేత పట్టుకుని ‘ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి’, ‘ చలో వరంగల్’ అనే నినాదాలు రాశారు. ఎమ్మెల్యే రాస్తున్నంత సేపు నాయకులంతా ఆసక్తితో పరిశీలించారు.