హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నూతన రంగాల్లో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాలను సింగపూర్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో సహకారం అందిస్తామని భారతదేశంలో సింగపూర్ హై కమిషనర్ సిమోన్ వాంగ్ అన్నారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు ఇక్కడ ఉన్న అవకాశాల పట్ల ఆసక్తితో ఉన్నాయని వాంగ్ తెలిపారు.
ప్రగతి భవన్లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సింగపూర్ హైకమిషనర్ సిమోన్ వాంగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, వివరాలను వాంగ్‌కు కేటీఆర్ అందించారు. హైదరాబాద్ నగరం కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా కాస్మోపాలిటన్ స్వభావంతో అభివృద్ధి చెందుతూ వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన ప్రభుత్వ విధానాలతో పాటు టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతుల వంటి వాటితో అనేక అంతర్జాతీయ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సింగపూర్ కంపెనీలు రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాల పట్ల సానుకూలంగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన డిబిఎస్ వంటి కంపెనీలు, తమకు ఇక్కడ ఉన్న వాతావరణం గురించి సానుకూల ఫీడ్ బ్యాక్‌ను అందించాయని మంత్రి కేటీఆర్‌కు హై కమిషనర్ వాంగ్ వివరించారు. సింగపూర్ కంపెనీలు ఐటీ, ఇన్నోవేషన్, ఐటీ అనుబంధ రంగాల్లో ఉన్న బ్లాక్ చైన్ వంటి నూతన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిస్తున్నాయని వాంగ్ తెలిపారు. హైదరాబాదులో ఉన్న టీ హబ్ వంటి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉన్న ఐటీ ఈకో సిస్టం, ఇన్నోవేషన్ సిస్టం గురించి సానుకూలతలు తెలుసన్నారు. ఒకవైపు ఆధునిక రంగాలలో పెట్టుబడులతో పాటు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లోనూ సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయని వాంగ్ స్పష్టం చేశారు.
సింగపూర్ కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణలో ప్రత్యేకంగా సింగపూర్ పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక జోన్ లేదా సింగపూర్ హబ్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కేటీఆర్ ప్రతిపాదించారు. సింగపూర్ పెట్టుబడులకు ప్రత్యేకంగా ఒక హబ్ ఏర్పాటు చేస్తామనడం ఒక గొప్ప ఆలోచన అని వాంగ్ అన్నారు. గతంలో తాను వియత్నాంలో పని చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం చేసి.. అనేక పెట్టుబడులను ఆకర్షించిందన్నారు. ఇప్పుడు వియత్నాంలో సింగపూర్ పెట్టబడులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ సమావేశం అనంతరం హై కమిషనర్ సిమోన్ వాంగ్‌తో పాటు చెన్నైలో సింగపూర్ కౌన్సిల్ జనరల్ పొంగ్ కాక్ టియన్లను మంత్రి కేటీఆర్ శాలువాలతో సత్కరించారు.
A delegation headed by High Commissioner of Republic of Singapore to India @SGinIndia H.E Mr. Simon Wong, called on Minister @KTRTRS in Hyderabad today. Principal Secretary @jayesh_ranjan was also present in the meeting. pic.twitter.com/KIhnuemBPs
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 13, 2021