ఎల్బీనగర్/హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): యువతిని వేధిస్తున్న సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్‌పై చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీకి చెందిన విద్యుత్ శాఖలో పనిచేసే ఓ యువతి 2020-21లో జాతీయ స్థాయి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో డీఎస్పీ కిషన్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. తాను బోధించే స్పెషల్ క్లాసులకు అటెండ్ కావాలని పేర్కొంటూ సదరు యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.
అనంతరం ఫోన్లో అభ్యంతరకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపిస్తూ ఆమెను తరుచూ వేధించాడు. ప్రస్తుతం సీఐడీలో ఎస్పీగా ఉన్న కిషన్‌సింగ్‌ను ఓ కేసు విషయంలో కలిసిన సదరు యువతిని తనతో స్నేహంగా ఉండాలని, హగ్ ఇవ్వాలని కోరాడు. దీంతో యువతి కిషన్‌సింగ్‌పై చైతన్యపురి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసుపై సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ స్పందించారు. సమగ్ర విచారణ అనంతరం నేరం రుజువైతే తక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కిషన్‌సింగ్ ఇటీవల అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ (నాన్ కేడర్)గా నియామకం పొందారని చెప్పారు. వెయింటింగ్‌లో ఉన్న కిషన్‌సింగ్‌కు ఈ నెల 27న పోస్టింగ్ ఇచ్చినట్లు మహేశ్ భగవత్ తెలిపారు.