హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ)/పటాన్చెరు: ప్రయాణికుల సౌకర్యం పట్ల బస్సు తయారు చేసినప్పుడే తగిన డిజైన్ చేస్తారు. స్లీపర్ అంటే ఒకలా, సీటింగ్ అంటే మరోలా బస్సును రూపొందిస్తారు. కానీ శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Vemuri Kaveri Travels Bus).. సీటింగ్ కోసం పర్మిషన్ తీసుకుని, స్లీపర్‌గా ఆల్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. ఒడిశాలోని రాయగడలో స్లీపర్ కోచ్‌గా ఆల్ట్రేషన్ పనులు చేయించినట్టు సమాచారం. అడ్డగోలు ఉల్లంఘనలతోనే, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే శుక్రవారంనాటి ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగిందని స్పష్టమవుతున్నది. బస్సులో ఫైర్ ఎక్స్టింగిషర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద సుత్తె లేకపోవడంతో ప్రయాణికులు బయటపడలేక పోయినట్టు సమాచారం.
ప్రమాదానికి గురైన బస్సు 2018లో డా మన్ అండ్ డయ్యూలో రిజిస్టర్ అయ్యింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ, ఏపీ, కర్నాటకలో తిప్పుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్-బెంగళూరు మధ్య రోజూ నడుపుతున్నారు. ఈ బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్ లేదు.. ఫిట్నెస్ లేదు.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు. పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 16 చలాన్లు ఉన్నాయి.
ఇందులో ఓవర్‌స్పీడ్‌కు సంబంధించిన జరిమానా కూడా ఉన్నది. అంటే ఆర్టీఏ అధికారులు చెప్పే దాదాపు అన్ని నిబంధనలను బస్సు యాజమాన్యం ఉల్లంఘించింది. మొత్తం కేసులు, వాటి జరిమానా విలువ రూ.23,120 ఉంది. కానీ రవాణాశాఖ అధికారులెవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ట్రావెల్స్ బస్సు రోడ్డుపై మృత్యుశకటంగా తిరిగింది… ప్రయాణికులను పొట్టనపెట్టుకున్నది. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పొరుగు రాష్ర్టాలతో కలిసి కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రమాదానికి గురైన బస్సుకు ఆల్ ఇండి యా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ గడువు 26 నెలల క్రితం (జూలై 27, 2023) గడువు ముగిసింది. ఏఐటీపీ అథారైజేషన్ గడువు కూడా 20 నెలల క్రితమే (ఏప్రిల్ 27, 2024) తీరింది. పొల్యూషన్ వ్యాలిడిటీ 18 నెలల క్రితం, ఫిట్నెస్ వ్యాలిడిటీ, ఇన్సూరెన్స్ వాలిడిటీలు ఆర్నెళ్లక్రితమే ముగిశాయి. టాక్స్ వాలిడిటీ కూడా 18 నెలల క్రితమే ముగిసింది.