నవాబుపేట, డిసెంబర్26 : మహబూబ్నగర్ జిల్లా జిల్లా నవాబుపేట మండలం కాకర్ల పహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త(Social media activist) దండు స్వామి (30) అనే వ్యక్తి గురువారం రాత్రి జడ్చర్ల సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్వామి గురువారం తన సొంత పని నిమిత్తం జడ్చర్లకు వెళ్లి తన పని ముగించుకొని రాత్రి కాకర్ల పహాడ్ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యంలో జడ్చర్ల మండలం బండమీదిపల్లి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దండు స్వామి మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
మరొకరి జీవితాల్లో వెలుగు నింపాలని..
కాగా, దండు స్వామి మృతి మరొకరికి తెలుగులో నింపాలనే లక్ష్యంతో అతడి తల్లిదండ్రులు కుశలమ్మ- వెంకటయ్య, భార్య లావణ్య, అతడి నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు దానం(Eye donation) చేశారు. ఈ క్రమంలో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు చెందిన వైద్యులు హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ జిల్లా దవఖానకు విచ్చేసి స్వామి నేత్రాలను స్వీకరించారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెంది పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు వారి కొడుకు కళ్లను దానం చేయడంపై పలువురు అభినందించారు. దండు స్వామి మృతి పార్టీకి తీరనిలోటని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.