హైదరాబాద్: నగరంలో వరద ముంపు సమస్యకు స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ (SNDP)తో శాశ్వత పరిష్కారం లభిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. SNDP కింద రూ.10 కోట్ల వ్యయంతో పికెట్ నాలాపై నిర్మించిన వంతెనను ఈ ఉదయం మంత్రి తలసాని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని నాలాలతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో SNDP కింద నాలాల సమగ్ర అభివృద్ధి జరుగుతున్నదని తెలిపారు. పికెట్ నాలాపై బ్రిడ్జి నిర్మాణంతో 40 కాలనీల ప్రజలకు వరద ముంపు సమస్య నుంచి శాశ్వత విముక్తి లభించిందన్నారు. బేగంపేట నాలా అభివృద్ధి పనులు కూడా రూ.46 కోట్ల వ్యయంతో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.