Tuition Fees | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో బీటెక్ ట్యూషన్ ఫీజుల సవరణ మళ్లీ మొదటికి రానున్నదా? దాదాపు 50 కాలేజీల్లో ఫీజుల పెంపునకు బ్రేక్లు పడనున్నాయా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీటెక్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై మళ్లీ పునర్విచారణ జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఖరారుచేసిన ఫీజులను రీవెరిఫికేషన్ చేయాలని కోరింది. దీంతో ఫీజుల సవరణ అంశం మొదటికొచ్చింది. రాష్ట్రంలో బీటెక్ ట్యూషన్ ఫీజుల సవరణపై తెలంగాణ ఫీజు అడ్మిషన్ అండ్ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఇప్పటికే ఒక దఫా విచారణను పూర్తిచేసింది. పలు కాలేజీల్లో ఫీజులను ఆ కమిటీ ఖరారుచేసింది.
ఇటీవలే ఈ ఫీజుల ఆమోదానికి టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశాన్ని నిర్వహించగా, ప్రతిపాదిత ఫీజులపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేసింది. మొత్తంగా సర్కారు గుర్రుగా ఉండటంతో 50 కాలేజీల ఫీజులు తగ్గుతాయన్న ప్రచారం జరుగుతున్నది. ఏ కాలేజీల్లో తగ్గుతాయి, ఏ కాలేజీలకు కోతలు పడతాయన్న ఆందోళనలు కాలేజీ యాజమాన్యాల్లో వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నాయి. ఇంతమాత్రం దానికి టీఏఎఫ్ఆర్సీ ఎందుకు? కసరత్తు దేనికని ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు గౌతంరావు ప్రశ్నించారు. టీఏఎఫ్ఆర్సీ, సర్కారు నిర్ణయాన్ని బట్టి తాము ప్రతిస్పందిస్తామని తెలిపారు.
40-50 కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరగడంపై సర్కార్ అనుమానాలను వ్యక్తంచేసింది. ఒకేసారి రూ.50-60 వేల ఫీజులు పెరగడానికి దారితీసిన కారణాలపై ఆరా తీసింది. ముఖ్యంగా రెండు, మూడు కాలేజీల్లో ఫీజులు రూ.2 లక్షలకు చేరాయి. పలు కాలేజీల్లో ఒకేసారి 50-60 వేల ఫీజులు పెరిగాయి. మరో 9-10 కాలేజీల్లో ఫీజులు పెరగనేలేదు. ఇలా ఇష్టారీతిన ఫీజులను పెంచడంపై సర్కారు వర్గాలు టీఏఎఫ్ఆర్సీని ప్రశ్నించాయి. ఈ ఫీజులపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది. దీంతో టీఏఎఫ్ఆర్సీ కమిటీ ఆయా ఫీజులపై మళ్లీ విచారణ జరపనున్నది. మళ్లీ 40-50 కాలేజీలను తిరిగి విచారణకు పిలుస్తారా? లేక ఆడిటర్లతో నివేదికలను తనిఖీ చేయిస్తారా? లేదంటే టీఏఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులే విచారణ జరుపుతారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.