టేక్మాల్ : అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా సమన్యాయం జరగాలనే సదుద్దేశంతో భారత రాజ్యాంగం రిజర్వేషన్లను కల్పించింది. అలాంటి రిజర్వేషన్ ఫలాలు అర్హులైన వారు వినియోగించుకుని లబ్ధిపొందుతుంటే..అనర్హులు కొందరు అక్రమ మార్గంలో రిజర్వేషన్లను కొల్లగొడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్టీలకు కేటాయించిన స్థానంలో బీసీ వర్గానికి చెందిన ఓ మహిళ పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందడమే ఇందుకు నిదర్శనం. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎస్టీలకు కేటాయించబడింది.
అయితే ఆ స్థానంలో బీసీ మహిళ ఎస్టీ సర్టిఫికెట్తో ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందింది. దీంతో అసలైన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ అందోల్ నియోజకవర్గం బంజారా సేవాలాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ముడావత్ శ్రీనివాస్ సాక్ష్యాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా రాంబాయి చదువుకున్న పాఠశాల నుంచి తీసుకున్న సమాచారంతో బీసీ కులానికి చెందినట్లుగా గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. గత 15 సంవత్సరాల క్రితం పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన రాంబాయి (బీసీ) వెంకటాపూర్ గ్రామం ఎస్టీ సామాజిక వర్గం ఎరుకల కుటుంబానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఎంపీటీసీ ఎన్నికల్లో ఎల్లంపల్లి స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు.
వెంకటాపూర్ గ్రామం ఎల్లంపల్లి ఎంపీటీసీ పరిధిలోకి వస్తుంది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో రాంబాయి భర్త ఎస్టీ కావడంతో తన భార్యకు సైతం ఎస్టీ కులం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి 2017 సెప్టెంబర్ 8వ తేదీన సర్టిఫికెట్‌ను తీసుకున్నారు. అక్రమంగా తీసుకున్న కులం సర్టిఫికెట్తో ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారని ఆరోపించారు. అలాగే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ కేటాయించబడింది.
దీంతో మళ్లీ రాంబాయి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి గెలిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్ ఫలాలు తప్పుడు మార్గంలో తీసుకున్న కులం సర్టిఫికెట్తో అక్రమంగా లాక్కోవడం వల్ల అసలైన ఎస్టీ వర్గానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఎస్టీలకు చెందిన రిజర్వేషన్‌ను బీసీ మహిళ దక్కించుకుని తమ ఎస్టీ వర్గాన్ని మోసం చేసిందని వాపోతున్నారు.
ఈ విషయమై అదనపు కలెక్టరు నగేష్, టేక్మాల్ తహసీల్దార్ తులసీరాంకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తహసీల్ధార్ తులసీరాంను వివరణ కోరగా గతంలో ఇచ్చిన కులం సర్టిఫికెట్‌ను రద్దు చేసే అవకాశం తమకు లేదన్నారు. ఉన్నతాధికారులకు మాత్రమే సర్టిఫికెట్ రద్దు చేసే అవకాశం ఉందని చెప్పారు. అక్రమ మార్గంలో రాజకీయ పదవులను పొందిన వారిని అడ్డుకునే అవకాశం రాజ్యాంగం ప్రకారం అధికారులకు లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
