హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాకు చెందిన మూడు రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్పీసీ) రెండు నెలల్లోనే రెండు వేల టన్నుల మిర్చిని సేకరించి, రూ.96 లక్షల ఆదాయం సంపాదించాయి. ఈ ఘనత సాధించిన సంఘాల అధ్యక్షులు స్వర్ణ కృష్ణవేణి, ఎస్ రాధ, బీ రమాదేవిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం హైదరాబాద్‌లో సన్మానించారు. ఇదే స్ఫూర్తితో రానున్న సీజన్లో పది వేల టన్నుల తేజ రకం మిర్చిని సేకరించాలని సూచించారు. ఇందుకు జూన్ నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. 20 గ్రామ స్థాయి కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి, ఇతర పంటలను కూడా కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్లాంట్ లిపిడ్స్ ప్రొక్యూర్మెంట్ అధికారి థామస్‌ను ఎఫ్పీసీల అధ్యక్షులు సన్మానించారు. కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ రజిత, డీపీఎం సుధాకర్ పాల్గొన్నారు.