హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు రూ.31వేల కోట్లు సమీకరిస్తున్నాం అని గత బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ‘రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వారిని రుణ విముక్తులను చేసింది. వారికి రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసింది.’ తాజా బడ్జెట్ ప్రసంగంలో భట్టివిక్రమార్క. మంత్రి ఒక్కరే కానీ ఏడాదిలోనే మాట మారింది. రూ. 2 లక్షలకు పైగా రుణం గల రైతులు.. ఆపై రుణాన్ని బ్యాంకుల్లో ఎప్పుడు చెల్లిస్తే ఆ మరుక్షణమే ప్రభుత్వం తరుపున రూ. 2 లక్షలు వారి ఖాతాలో జమ చేస్తాం’ పలు సందర్భాల్లో సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు. ఈ విధంగా రుణమాఫీ అయిపోయిందని చెప్తూ ప్రభుత్వం తాజా బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు. రుణమాఫీపై ఇద్దరు సర్కారు పెద్దలు మాట తప్పారని విమర్శలు వినిపిస్తున్నాయి. రుణమాఫీకి కాంగ్రెస్ సర్కారు రాంరాం చెప్పిందని, పెద్ద ధోకా ఇచ్చిందని రైతులు మండిపడుతున్నారు.
కట్టాల్సింది మిగిలే ఉంది!
ప్రభుత్వం హామీ మేరకు 16.35 లక్షల మంది రైతులకు ఇంకా రూ. 10,384 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్లో మాత్రం పైసా కూడా కేటాయించలేదు. దీంతో రుణమాఫీ ఒడిసిన ముచ్చటగా తేలిపోయిందని రైతులు చెప్తున్నారు. రూ.2 లక్షలకుపైగా రుణాలు కలిగిన రైతులు అలాగే ఉండిపోగా రూ.2 లక్షలలోపు రుణాలు కలిగిన రైతులు కూడా చాలామంది మిగిలిపోయారు. రూ.2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు రూ.31వేల కోట్ల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. గత బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని పేర్కొన్నారు. గత బడ్జెట్లో రూ. 26వేల కోట్లు కేటాయించారు. అందులో రూ. 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. మిగిలిన రుణాల సంగతి చెప్పకుండా రుణమాఫీ పూర్తయిందని చెప్తూ, ప్రభుత్వం మొండి చేయి చూపించిందని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.
పంటల బీమాకు ఎగనామం
ప్రభుత్వం పంటల బీమాకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నది. బడ్జెట్లో తూతూ మంత్రంగా నిధులు కేటాయించింది. వాస్తవానికి పంటల బీమాకు ప్రభుత్వ, రైతుల వాటా కలిపితే ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. కానీ ప్రభుత్వం బడ్జెట్లో రూ. 981 కోట్లు మాత్రమే కేటాయించి రూ. 2019 కోట్లకు కోత పెట్టింది.
యాంత్రీకరణకు అంతంతే
బడ్జెట్లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం కేవలం రూ.54 కోట్లు కేటాయించింది. ఈ కాస్త మొత్తంతో రైతులకు యంత్రాలేం సరఫరా చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రైతుకూలీలకు రూ.2,400 కోట్లు కోత
భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించిన సర్కారు మోసం చేసిందని రైతు లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత బడ్జెట్లో రూ. 1800 ఓట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో కేవలం రూ.600 కోట్లతో సరిపెట్టిందని మండిపడుతున్నారు. భూమిలేని రైతు కూలీలు 25 లక్షల మంది ఉన్నట్టు అంచనా. వీరికి ఏడాదికి రూ.12వేల చొప్పున ఇవ్వాలంటే రూ. 3వేల కోట్ల నిదులు అవసరం. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 600 కోట్లు పెట్టి కూలీలకు మొండి చెయ్యి చూపించిందని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సన్నాల రైతులకు సర్కారు సున్నం
సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని రైతులకు హామీ ఇచ్చిన సర్కారు ఇప్పుడు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వానకాలం సీజన్లో 40 లక్షల ఎకరాల్లో సన్నాలు ఉత్పత్తి అయినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఈ లెక్కన ఒక్క సీజన్లోనే 88 లక్షల టన్నుల సన్నాలు ఉత్పత్తి అవుతాయి. ఒక్క సీజన్లో టన్నుకు రూ. 5వేల చొప్పున బోనస్ ఇస్తే రూ.4,400 కోట్లు అవసరం అవుతాయి. కానీ ప్రభుత్వం కేవలం రూ. 1,800 కోట్లు నిదులు కేటాయించి చేతులు దులిపేసుకున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గొర్రెలు, చేపల పంపిణీ బంద్
మత్స్యకారులు, గొల్ల కురుమల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రారంభించిన చేప పిల్లలు, గొర్రెల పంపిణీకి కాంగ్రెస్ స ర్కార్ ఎగనామం పెట్టిందని ఆయా వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.
సాగుకు 9328 కోట్లు కోత
వ్యవసాయ శాఖకు భారీగా కోత పెట్టింది. నిరుడు రూ. 49,383 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ. 24,439 కోట్లు కేటాయించింది. నిరుడు రుణమాఫీకి కేటాయించిన రూ. 26వేల కోట్లు తీసేస్తే, వ్యవసాయానికి కేటాయించిన నిధులు నికరంగా రూ. 23,383 కోట్లు మాత్రమే. ఈ ఏడాది బడ్జెట్లో రుణమాఫీకి రూ. 10,384 కోట్లు కేటాయించాల్సి ఉండే. ఇది కలిపితే తాజా బడ్జెట్ రూ. 33,767 కోట్లుగా ఉండాలి. కానీ ప్రభుత్వం రూ. 24,439 కోట్లు కేటాయించింది. తద్వారా వ్యవసాయశాఖకు రూ. 9328 కోట్లు కోత పెట్టినట్టయింది. ఇక పశుసంవర్ధక, మత్స్యశాఖలకు బడ్జెట్లో కోత పెట్టింది.
పంటల కొనుగోళ్లకు నిధులు సున్నా
రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం నుంచి మార్క్ఫెడ్ ద్వారా కందులు, మక్కలు, జొన్నలతో పాటు ఇతర పంటలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇందుకోసం సర్కారు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.