శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:48

వలస పాలన ప్రతీక పతనం

వలస పాలన ప్రతీక పతనం

  • పాత సచివాలయం 90శాతం కూల్చివేత
  • మరో రెండు రోజుల్లో సంపూర్ణం
  • జే, ఎల్‌ బ్లాకుల్లో మిగిలిన పనులు
  • శరవేగంగా శిథిలాల తొలగింపు
  • ఇబ్బందులు రాకుండా చర్యలు
  • మీడియా ప్రతినిధులకు అనుమతి
  • స్వయంగా తీసుకెళ్లిన అధికారులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వలస పాలన ప్రతీక కుప్పకూలుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించే అధునాతన, కొత్త సచివాలయానికి మార్గం సుగమమవుతున్నది. పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు తొంభైశాతం పైగా పూర్తయ్యాయి. శిథిలాలను కూడా వేగంగా తొలగిస్తున్నారు. కూల్చివేత సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశముండటంతో ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించలేదు. కూల్చివేత వార్తల సేకరణకు అనుమతించాలని మీడియా ప్రతినిధులు పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తిచేయడంతో అధికారులు సోమవారం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి సచివాలయ ప్రాంతానికి వారిని తీసుకెళ్లారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో ఐదు బస్సుల్లో వెళ్లిన మీడియా ప్రతినిధులు.. సచివాలయం కూల్చివేత పనులను పరిశీలించారు. 

రెండురోజుల్లో పనులన్నీ పూర్తి

పాత సచివాలయ భవనాలు కూల్చివేత పనులను అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. తొలుత ‘సీ’ బ్లాక్‌ నుంచే కూల్చివేత పనులను ప్రారంభించారు. 90% పనులను పూర్తి చేశారు. ఏ, బీ, సీ, డీ, హెచ్‌ నార్త్‌, హెచ్‌ సౌత్‌, కే బ్లాకులను పూర్తిగా నేలమట్టం చేశారు. జే, ఎల్‌ బ్లాక్‌లను సైతం సగానికి పైగా కూల్చివేశారు. మరో రెండ్రోజుల్లో పాత భవనాల కూల్చివేత పనులన్నీ పూర్తికానున్నాయి. బిల్డింగ్‌ కూల్చివేతలకు అధికారులు అత్యాధునిక యంత్ర సామగ్రిని వినియోగిస్తున్నారు. ఎన్ని అంతస్తుల భవనాన్నైనా కూల్చడానికి ఊపయోగించే అతి పెద్ద లాంగ్‌బూమర్‌ యంత్రాలను, ఇటాచీలు, క్రేన్లను వాడుతున్నారు. 

శరవేగంగా వ్యర్థాల తరలింపు

కూల్చివేత ప్రాంతంలో వ్యర్థాలను వెంటనే తరలిస్తున్నారు. శిథిలాల్లో ఐరన్‌ను కాంక్రీట్‌ నుంచి వేరుచేస్తూ ప్రత్యేకంగా లోడ్‌చేస్తున్నారు. ఇతర స్క్రాప్‌ను కూడా వేర్వేరుగా తరలిస్తున్నారు. భవన సముదాయ ప్రాంతాలను చదునుచేస్తున్నారు. మొత్తం 4500 లారీల లోడ్‌ ఉంటుందని అంచనా వేయగా, అందులో ఇప్పటికే రెండువేల ట్రిప్పులను తరలించారు. మిగతా పనులు సైతం చురుకుగా సాగుతున్నాయి.   

పూర్తిగా రక్షణ చర్యలు

భవనాల కూల్చివేత సమయంలో అవాంఛిత ఘటనలు జరుగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. దుమ్ము లేవకుండా భారీ వాటర్‌ స్ప్రింక్లర్లను వినియోగిస్తున్నారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భవనాలు కూల్చేటప్పుడు చుట్టుపక్కల భవనాలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పకడ్బందీ రక్షణచర్యలు తీసుకున్నారు. పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు ప్రకారం కవరేజీ చేయండి: మీడియాతో హైకోర్టు

అంతకుముందు ఈ అంశంలో విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ఉపయోగించుకుని సచివాలయం ప్రాంతాన్ని సందర్శించి రావాలని మీడియా ప్రతినిధులకు సూచించింది. కూల్చివేత కవరేజీకి మీడియాను అనుమతించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించింది. తమకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా కూల్చివేత పనుల దృశ్యాలను ప్రసారం చేసుకునే వెసులుబాటు ఉండాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన విధంగా కూల్చివేతలను కవర్‌ చేయడానికి వెళ్లాలని హైకోర్టు సూచించింది. సచివాలయ ప్రాంతంలో సొరంగాలు ఉన్నాయని విన్నామని, అలా ఉంటే వాటిని పర్యాటకప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నది.

ప్రమాదమనే వద్దన్నాం: మంత్రి వేముల

పాత భవనాల కూల్చివేత సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించలేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదన్నారు. కూల్చివేత వార్తలు సేకరించేందుకు అనుమతించాలని మీడియా ప్రతినిధుల నుంచి పదేపదే విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని మీడియా ప్రతినిధులను ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్లిందని చెప్పారు.


logo