హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోటీపరీక్షలు సహా ఎస్సెట్, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లపై సర్కారు కొరడా ఝలిపించనున్నది. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోనున్నది. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అమలుచేయాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇంటర్ నుంచి యూనివర్సిటీల వరకు అన్ని స్థాయిల్లో లెక్చరర్ల నియామకం కోసం కాలేజీ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని సర్కారు పరిశీలిస్తున్నది. ఈ నేపథ్యంలో విద్యారంగంలో సంస్కరణలకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో భేటీ అయ్యింది. మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోచింగ్ సెంటర్ల నిర్వహణ విషయంలో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేయకపోవటంతో ఇటీవలే కేంద్రం సీరియస్ అయ్యింది. దీంతో ఆ మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలుచేయాలని క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ), ప్రైవేట్ స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణకు ఫీజు రెగ్యులేటరీ కమిటీ, తెలుగుభాష అమలు, ఆర్టీఈ ప్రకారం ప్రైవేట్ బడుల్లో 25 శాతం సీట్లు.. తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రాథమికోన్నత బడులను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసే అంశంపై నివేదికను సమర్పించాలని శ్రీధర్‌బాబు సూచించారు. జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లల్లోని 1,600 మంది టీచర్లను ఇతర స్కూళ్లకు బదిలీచేయాలని ఆదేశించారు. 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ట్రిపుల్ ఐటీలో బయోసైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టాలని వెల్లడించారు. ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై కమిటీ వేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఇంటర్‌బోర్డు డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తె తెలంగాణ) : రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు జోరందుకున్నాయి. 65 ఏండ్లు దాటిన టీచర్లను ఉద్యోగం నుంచి తొలిగించినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదని అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకులు నల్లభారతి ఆరోపించారు. రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష ఇస్తామని హామీ ఇచ్చారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు ఐదు నెలలు నుంచి జీతాలు ఇవ్వడంలేదని, వంట గ్యాస్, కూరగాయల బిల్లులు సకాలంలో రావడంలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీల్లో పని చేస్తున్న సిబ్బంది పదవీ విరమణతో ఐదు వేలకు పైగా టీచర్లు, ఆయాలు తగ్గిపోవడడంతో కేంద్రాల నిర్వహణ భారంగా మారిందని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రి, అధికారులను సంప్రదిస్తున్నా ఇంతవరకు ఎలాంటి హామీ రాలేదని మండిపడ్డారు.