హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. లక్ష్యాన్ని మించి రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. నల్లగొండ, హనుమకొండ, వికారాబాద్ జిల్లాలు, హెచ్ఎండీఏ మినహా మిగతా అన్ని జిల్లాల్లో 100 శాతానికి మించి ప్రభుత్వంలోని వివిధ శాఖలు మొక్కలు నాటాయి. ఎనిమిదో విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. శుక్రవారం నాటికి లక్ష్యానికి మంచి 20.06 కోట్ల మొక్కలు నాటడం పూర్తయినట్టు అటవీశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 102.68 శాతం మొక్కలు నాటినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఎనిమిదో విడతలో రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 100 శాతానికి మించి మొక్కలు నాటారు. వనపర్తి జిల్లాలో 13.6 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించగా.. 25.04 లక్షల మొక్కలను నాటి 225.41 శాతంతో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా 167% , మంచిర్యాల 147.04%, కామారెడ్డి 136.35 శాతం, జీహెచ్ఎంసీ- హైదరాబాద్ 127.08, ములుగు 126.65% మొక్కలు నాటిన జిల్లాలుగా తర్వాత స్థానాల్లో నిలిచాయి. నల్లగొండ జిల్లా 53.98 లక్షల మొక్కలు నాటి 76.01% సగటుతో చివరి స్థానంలో నిలిచింది.