హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): యువతకు తెలంగాణ స్ఫూర్తిగా నిలుస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల వ్యవసాయ, ఐటీ రంగాల్లో యువత సత్తా చాటుతున్నదని అన్నారు. గువాహటిలో జరుగుతున్న 8వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్‌లో మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ పోచారం, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు. మంగళవారం ‘దేశ ప్రగతి, సమాజంలో మార్పు – యువత పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. యువకులు వ్యవసాయ రంగంలోకి వస్తే పంటల ఉత్పాదకత మెరుగుపడుతుందని తెలంగాణ నిరూపించిందని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల మంది యువ రైతులు ఉన్నారని, వీరిని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్సిడీ పథకాలు, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులను వ్యవసాయ, ఉద్యాన శాఖ ద్వారా అందుబాటులోకి తెస్తున్నారని వివరించారు. ఐటీ రంగంతో యువత అత్యధికంగా ఉపాధి పొందుతున్నారని, హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని వివరించారు. 6.04 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులు ఉండగా ప్రతి సంవత్సరం 40,000 మంది అదనంగా ఉద్యోగాలు పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్రంలో 16 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన సాధ్యమైందని అన్నారు.
ఉపాధి కల్పన విషయంలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 1.34 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని, కొత్తగా మరో 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు. ప్రభుత్వ రంగంలోకి యువత అధికంగా రావడం వల్ల ప్రభుత్వ పథకాలు, సేవలు ప్రజలకు మరింతగా చేరువ అవుతాయనే విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.